సబ్సిడీ సిలిండర్ అటకెక్కుతున్నది. మహాలక్ష్మి పథకంలో 500కే అందిస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికిన కాంగ్రెస్ సర్కారు, తీరా గెలిచిన తర్వాత తుస్సుమనిపిస్తున్నది. అనేక కొర్రీలు, సవాలక్ష ఆంక్షలు పెట్టి కనీసం 50 శాతం మందికి కూడా రాయితీ ఇవ్వడం లేదని తెలుస్తున్నది. అయితే అర్జీలో గానీ, సర్టిఫికెట్లలో గానీ చిన్న అక్షర దోషం ఉన్నా రిజెక్ట్ చేస్తున్నదని, కార్యాలయాల చుట్ట్టూ తిరగలేక అలసిపోతున్నామని పేదలు వాపోతున్నా యంత్రాంగం నుంచి సరైన స్పందన కరువవుతున్నది. అయితే లబ్ధిదారులు లెక్క, ఎంతమందికి ఇస్తున్నారని అడిగితే తమకు తెలియదనడం, వివరాలు అత్యంత గోప్యంగా ఉంచడం, హైదరాబాద్ స్థాయిలోనే అంతా జరుగుతున్నదని అధికారులు చెబుతుండడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
జగిత్యాల, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : కొండంత రాగం తీసి, కూసింత పాట పాడినట్టుగా ఉన్నది కాంగ్రెస్ సర్కారు తీరు! ఎన్నికలకు ముందు మహాలక్ష్మి పథకంలో మహిళలకు 500కే సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులందరికీ ఇస్తున్నామని గొప్పలు చెప్పింది. సబ్సిడీ సిలిండర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలను పెట్టింది. తెల్లరేషన్ కార్డుదారులకే ఇస్తామని చెప్పింది. అలాగే మహిళపై గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలన్న నిబంధన లేకున్నా, అనధికారికంగా అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది. రేషన్‌కార్డులో ఉన్న పేరు, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ పేరు సరిపోవాలి. అక్షర దోషం ఉన్నా, సబ్సిడీ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దాంతోపాటు గ్యాస్ కనెక్షన్ నంబర్, ఎల్పీజీ కస్టమర్ ఐడీ, ఆధార్‌కార్డు నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్లు అన్ని సరిపోవాలని చెబుతున్నారు.
ఈ నిబంధనల నేపథ్యంలో అర్హత ఉన్నప్పటికీ ప్రయోజనం పొందలేకపోతున్నామని, దరఖాస్తుదారులను ప్రభుత్వం అనేక విధాలుగా వడగట్టి సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇక లబ్ధిదారుడికి ఏడాదికి ఎన్ని సబ్సిడీ సిలిండర్లు అందజేయాలన్న విషయంలోనూ ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. గతంలో ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్‌దారుడు మూడేండ్ల కాలంలో సగటున నెలకు ఎన్ని సిలిండర్లు వాడారో..? అన్ని రిఫిళ్లను మాత్రమే 500కు పంపిణీ చేయాలని నిబంధన పెట్టింది.
ఈ లెక్కన ఒక కుటుంబం మూడేండ్ల వ్యవధిలో 36 సిలిండర్లు వినియోగిస్తే, నెలకు ఒక్క సిలిండర్ సబ్సిడీపై ఇస్తుంది. అంతకంటే ఎక్కువ వినియోగించినట్లయితే అదనపు వాటికి సబ్సిడీ వర్తించని పరిస్థితి నెలకొంది. అలాగే వినియోగదారుడు రిఫిల్ కోసం బుక్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ధర పూర్తిస్థాయిలో చెల్లించాలని నిర్దేశించింది. డెలివరీ అయిన కొద్ది రోజుల్లో లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేస్తున్నది. ప్రస్తుతం 14 కిలోల సిలిండర్ ధర 875 ఉండగా, అందులో కేంద్ర ప్రభుత్వం 47, రాష్ట్ర ప్రభుత్వం 327 సబ్సిడీ రూపేణా అందజేస్తున్నది. వినియోగదారులకు 500కే పడుతుంది.
గ్యాస్ సిలిండర్ల పంపిణీ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సబ్సిడీ సరిగా పడడం లేదని, ఎప్పుడు వేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. ఇంకా చాలా మంది అసలు తమకు సబ్సిడీ సిలిండరే రావడం లేదని, తమను ఎంపిక చేయలేదని ఆరోపిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు సైతం సబ్సిడీ సిలిండర్లకు సంబంధించిన వివరాలు చెప్పడం లేదు. అతి కష్టంపై జగిత్యాల జిల్లాకు సంబంధించి గతేడాది నవంబర్ వరకు సబ్సిడీపై వచ్చిన సిలిండర్ల సంఖ్య, సబ్సిడీ వివరాలు బయటకు వచ్చాయి. నవంబర్ వరకు వచ్చిన వివరాల ప్రకారం 1,93,900 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. నవంబర్‌లో లబ్ధిదారులకు 51,394 సబ్సిడీ సిలిండర్లను పంపిణీ చేశారు. దీనికి గాను 1.52 కోట్ల సబ్సిడీని ఇచ్చారు. అంతకు ముందు నెలలకు సంబంధించిన వివరాలను సైతం అందులో పొందుపర్చారు.
మార్చి నుంచి నవంబర్ చివరి నాటికి 5,79,264 సిలిండర్లకు సబ్సిడీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనికి గాను 17.26 కోట్ల సబ్సిడీని ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 2,89,725 మంది లబ్ధిదారులు ఉంటే అందులో 1,93,900 లక్షల మందికి మాత్రమే సబ్సిడీ సిలిండర్లు అందినట్లు స్పష్టమైంది. దాదాపు మరో లక్ష మందికి సబ్సిడీ అందడం లేదని తేటతెల్లమైంది. 1,93,900 మందికి 5,79,264 సిలిండర్లు మాత్రమే పంపిణీ చేశారంటే తొమ్మిది నెలల కాలంలో సగటున 3 కంటే తక్కువ సిలిండర్లు పంపిణీ జరిగినట్లు స్పష్టమవుతున్నది. ఈ లెక్కన ఒక కుటుంబానికి తొమ్మిది నెలల కాలంలో కనీసం 950 లబ్ధి కూడా కలుగలేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతోటి సాయానికి ప్రభుత్వం తామేదో అన్ని కుటుంబాలను ఉద్దరిస్తున్నట్టు, 500కే సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించుకోవడంపై లబ్ధిదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
గ్యాస్ సబ్సిడీ సిలండర్లకు సంబంధించిన వివరాలు అందజేయాలని జిల్లా పౌర సరఫర శాఖ అధికారులను కోరగా, వారు చేతులెత్తేశారు. ‘మా వద్ద జిల్లాలో ఏయే రకం.. ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? ఎంతమంది అర్హులు? అన్న వివరాలు మాత్రమే ఉన్నాయి. ఎంత మందికి సబ్సిడీ వర్తిస్తుంది? సగటున ఎంత మొత్తం సబ్సిడీ నిధులు వస్తున్నాయి? వివరాలు మా వద్ద లేవు. మాకే కాదు ఏ జిల్లాలోనూ ఆ వివరాలు అందుబాటులో లేవు’ అని అధికారులు చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ఏర్పాటుచేసిన ప్రజా పాలనలో 500కు సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్నం. కానీ, సిలిండర్ తీసుకున్న తర్వాత బ్యాంకు ఖాతాలో సబ్సిడీ డబ్బులు మాత్రం పడడం లేదు. ఆఫీస్‌కి వెళ్లి అడిగితే ‘మేం బిల్లు కొట్టినం. మీ కనెక్షన్ వివరాలు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాసుబుక్ కార్డు, కరెక్ట్ ఉంటే బ్యాంకులో డబ్బులు పడతయి’ అని అంటున్నరు. కానీ, పైసలు పడడం లేదు. మీ కార్డుల్లో, కనెక్షన్ కార్డులో తప్పులున్నయని మండల ఆఫీస్‌కు పోయి అడుగమంటున్నరు. అక్కడికి పోతే ఒకసారి సర్వర్ డౌన్ అని, ఇంకోసారి సార్ రాలేదని తిప్పి పంపుతున్నరు. తిరిగీ తిరిగీ ఇబ్బందైతంది. సబ్సిడీ సిలిండర్ వస్తదో రాదో..
– కెకెర స్వప్న, రాపల్లి గ్రామం (గొల్లపల్లి మండలం)
కాంగ్రెస్ ప్రభుత్వం 500కు సిలిండర్ ఇస్తామని ప్రకటించినంక దానికోసం ఆగమై తిరుగుతున్న. డబ్బులు బ్యాంకులో పడాలంటే మండల్ ఆఫీస్‌కు పొమ్మని గ్యాస్ కంపెనీ వాళ్లు అంటున్నరు. మండల్ ఆఫీసు పోతే అదేందో అయితలేదు అంటున్నరు. నాకు సక్కగ తెలువదు. ఎవరికి చెప్పినా పట్టించుకుంట లేరు. నేను ఎవరికి చెప్పుకోవాలి..? ఎటు తిరగలేక చెప్పలేక ఉంటున్నా. గ్యాస్ పైసలు రావు. మన్ను పైసలు రావు. అంత ఉత్త ముచ్చటే సార్.
– మారంపల్లి పోషవ్వ, గృహిణి, రాపల్లి (గొల్లపల్లి మండలం)