తిమ్మాపూర్, మార్చి 27: గ్రామ ప్రజాప్రతినిధి తన ఊర్లోని ప్రతీ ఒక్క రైతు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. గ్రామాల్లో ప్రధానంగా రైతులే ఉంటారు కాబట్టి, వారికే పెద్ద పీఠ వేస్తారు రాజకీయ నాయకులు. ఓ తాజామాజీ ఉపసర్పంచి రైతులు ఎండుతున్న పొలాలను చూసి మనసొప్పక సొంత ఖర్చులతో కాలువ తీయించి కుంటను నింపి, ఎండుతున్న పొలాలకు జీవం పోశాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (Thimmapur) మండలంలోని మల్లాపూర్‌లో ప్రతి ఏడాది ఎండాకాలం ప్రారంభంలోనే నీటి ఎద్దడి మొదలౌతుంది. గ్రామానికి తాగు నీటి సమస్య కూడా తీవ్రంగా ఉంటుంది. ఆ గ్రామానికి ప్రధాన నీటి వనరు లోయకుంట. అయితే ఆ కుంటలో నీళ్లు ఉంటే గ్రామమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. గ్రామం సమీపాన కాళేశ్వరం నీళ్లు పారుతున్నా ఆ గ్రామానికి నీళ్ల కటకట ఉంటుంది.
లోయకుంట నిండితే నీటి ఎద్దడి తప్పుతుందని భావించిన ప్రజాప్రతినిధులు, రైతులు.. గ్రామానికి కొద్ది దూరం నుంచి వెళ్తున్న డీ4 కెనాల్ నుంచి ఆ కుంటలోకి నీళ్లు వెళ్లేందుకు పైపులైన్ ద్వారా నీళ్లను మళ్లించాలనుకున్నారు. తదనుగునంగా ప్లానింగ్ చేసి ఓ నాయకునికి కాంట్రాక్టు పనులు అప్పగించారు. అయితే పనులు సవ్యంగానే చేసినా ఆ పైప్ లైన్‌కు ఇతర ప్రాంతాలకు వెళ్తున్న మిషన్ భగీరథ లైన్ అడ్డురావడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.
లోయకుంటలో నీళ్లు నిండేలా అధికారులు పైప్‌లైన్ ద్వారా నీటిని అందించేందుకు ప్లానింగ్, కాంట్రాక్ట్ కావడంతో ఎలాగైనా లోయకుంట నిండుతుందనే ఆశతో పొలాలు వేసుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. నీరు వచ్చే మార్గం లేకపోవడంతో కొంతమంది రైతులు తబ పొలాలను మేతకు సైతం వినియోగించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మల్లాపూర్ గ్రామ మాజీ ఉపసర్పంచి, బీఆర్ఎస్ నాయకుడు బుడిగె పర్శరాములు గౌడ్ రైతుల పొలాలను ఎలాగైన బతికించాలనే సంకల్పంతో డీ4 కెనాల్‌కు మరోచోట నుంచి రైతుల భూముల్లో నుంచి కాలువ కొట్టి లోయకుంటలోకి నీళ్లు వెళ్లేలా చేశాడు. దీంతో కుంట నిండుకుండలా మారి భూగర్భజలాలు పెరిగి కుంటకింద ఉన్న దాదాపు రెండు వందల ఎకరాలు ఇప్పుడు ఇబ్బంది లేకుండా పారుతున్నది. అలాగే గ్రామానికి మంచినీటి ఎద్దడి కూడా లేకుండా పోయింది. అధికారులు చేయలేని పనిని మాజీ ఉపసర్పంచి పర్శరాములు గౌడ్ చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలి..
కుంటలకు నీళ్లు వచ్చేందుకు కాంట్రాక్ట్ అయిందని తెలుసుకుని ఎలాగైనా సమయానికి నీళ్లు వస్తాయని రైతులు పొలాలను వేసుకున్నారని పర్శరాములు అన్నారు. ఎండలు ప్రారంభంకాగానే పొలాలకు నీళ్లు సరిపోక ఇబ్బంది అయింది. పైప్‌లైన్ కూడా ఫెయిల్ కావడంతో రైతులు పొలాలు ఎండిపోవుడు ఖాయం అనుకున్నరు. కొద్దిదూరం నుంచే కాలువ పోతున్నా.. పొలాలు ఎందుకు ఎండాలని సొంత ఖర్చులతో రైతులను ఒప్పించి వారి పొలాల్లో నుంచి తాత్కాలిక కాలువను తీసి కుంట నిండేలా చేశానని చెప్పారు. ఇన్ని ఎకరాలు ఇప్పుడు సస్యశ్యామలంగా అయినందుకు సంతోషంగా ఉందన్నారు. కుంటలో నీళ్లు ఉంటే గ్రామం ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.