క్రిప్టో కరెన్సీ జగిత్యాల జిల్లాను నిండా ముంచింది. ఏడాదిన్నర పాటు ఒక ఊపు ఊపిన క్రిప్టో బిట్‌కాయిన్ వ్యవస్థ లీలలు.. అందులోని మోసాల కథలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా రూ.1400 కోట్ల నుంచి రూ.1600 కోట్ల మధ్య దందా నడిచినట్లుగా నిపుణులు చెబుతున్నారు. కొడిమ్యాలతో పాటు జగిత్యాలలో నమోదైన కేసులలో ఇద్దరితో పాటు, కీలక దళారిగా వ్యవహరించిన జగిత్యాలకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. తదుపరి హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో పాటు జగిత్యాలకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ అరెస్ట్‌ల నేపథ్యంలో పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. దందాలో జిల్లాకు చెందిన వేలాది మంది నష్టపోయినట్లు, వందల సంఖ్యలో దళారులు, తప్పుడు యాప్‌లతో, తప్పుడు పద్ధతుల్లో పెట్టుబడులు పెట్టించి రూ.వందల కోట్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారాలు, మోసాలను చూసి పోలీసులే అవాక్కవుతున్నట్లు తెలుస్తోంది.
జగిత్యాల, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం నిషేధం విధించకపోవడం, వ్యక్తిగతంగా నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించడాన్ని అవకాశంగా తీసుకున్న పలువురు బ్రోకర్లు జగిత్యాల జిల్లాలో క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ దందాలకు తెరలేపారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయన్న ప్రచారం చేసి, డబ్బులతో పాటు, దావత్‌లు, వేతనాలు, నజరానాలు, విదేశీ పర్యటనలు నిర్వహించి కోట్లాది రూపాయలు దండుకున్న దళారుల కథలు వెలు గు చూస్తున్నాయి. కొడిమ్యాలలోని పోలీస్ స్టేషన్లో కొందరు క్రిప్టో కరెన్సీ బాధితులు తమను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారని ఫిర్యాదు చేయడంతో సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, వీరబత్తిని రాజుతో పాటు, క్రిప్టో కరెన్సీలో కీలక దళారిగా వ్యవహరించిన జగిత్యాలకు చెందిన కస్తూరి రాకేశ్‌ను అరెస్ట్ చేశారు. తదుపరి జగిత్యాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు తాము దాదాపు రూ.కోటిన్నర నష్టపోయామంటూ ఫిర్యాదు చేయగా, హైదరాబాద్‌కు చెందిన వరాల వెంకటేశ్వరరావు, జగిత్యాలకు చెందిన కస్తూరి శ్యాంసుందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రూ.5.40 లక్షలు, ల్యాప్‌ట్యాప్‌లు, సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో కిప్టో కరెన్సీలో పేరున్న బిట్ కాయిన్, ఎథీరియమ్ లాంటి కరెన్సీలే కాకుండా పేరు లేని, అనామకమైన కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఆన్లైన్లో క్రిప్టో కరెన్సీ అనుమతి లేని అనేక కంపెనీల తరఫున జిల్లాలో వ్యాపారం చేశారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన నకిలీ యాప్‌లను సృష్టించి, రూ.వందల కోట్లు కొట్టేసినట్లు పోలీసులు చెబుతున్నారు. జగిత్యాల, కొడిమ్యాలలో అరెస్ట్ అయిన క్రిప్టో కరెన్సీ ఏజెంట్లను విచారించగా, వారు క్రిప్టో పేరిట ఒక డూప్లికేట్ యాప్‌ను మెటాఫండ్ ప్రో సృష్టించినట్లు తేటతెల్లమైంది. నకిలీ యాప్‌కు క్రిప్టో యాప్‌లతో సంబంధం లేదని చెబుతున్నారు. క్రిప్టో కరెన్సీ వ్యాపారానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ దేశంలో దీనిపై ఎవరికీ అవగాహన లేకపోవడం, ఆన్లైన్ వ్యాపారం కావడంతో చాలా మందికి అర్థం కాలేదని, దీన్ని ఆసరాగా చేసుకొని నకిలీ యాప్‌లను సృష్టించి దోచేశారని చెబుతున్నారు. జిల్లాలో వాస్తవమైన క్రిప్టో కరెన్సీ దందా చేసిన వారు ఎవరు? నకిలీ యాప్‌ల ద్వారా చేసిన వారు ఎవరు? అన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసు శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీని బాగా ప్రమోట్ చేసి, కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టించిన వారిపై పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలిసింది. బాధ్యతాయుతమైన వృత్తుల్లో ఉన్నవారు క్రిప్టో కరెన్సీ దందాలు చేశారని తెలుసుకొని పోలీసులే విస్తుపోతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు, పలు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న సర్కార్ సార్లు క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో కీలకపాత్ర పోషించారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే, జిల్లాలోని పలువురు వైద్యులు, ముఖ్యంగా జిల్లా కేంద్రానికి చెందిన ఒక పిల్లల వైద్యుడు, ఒక ఫిజీషియన్, ఒక ఆర్థోపెడిషియన్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లుగా సమాచారం. ఒకరిద్దరు వైద్యులు క్రిప్టో కరెన్సీ ఏజెంట్లుగా మారి, వైద్యులతో తమకు ఉన్న పరిచయాలతో వారిని క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్‌లో భాగం చేసినట్లుగా చెబుతున్నారు. అన్నింటికంటే విచిత్రంగా పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు సైతం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు చైన్లను వృద్ధి చేసినట్లు పోలీసు శాఖ గుర్తించి తలలు పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాలో పనిచేసి, ఇతర జిల్లాలకు బదిలీ అయిన సీఐ ర్యాంకు అధికారితోపాటు, ముగ్గురు ఎస్ఐలు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి, లాభాలు ఆర్జించడంతోపాటు క్రిప్టో చైన్‌ను పెంచినట్లుగా పోలీసు వర్గాలే చెప్పుకొంటున్నాయి. ఇక రాజకీయ నాయకులు సైతం ఇందులో భాగమయ్యారు. ఒక ప్రజాప్రతినిధి సోదరుడు క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లుగా చెబుతున్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతిధి సైతం క్రిప్టో కరెన్సీని నమ్మి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి, నష్టపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అధికార పక్షంలోని ఒక ప్రజాప్రతినిధికి అనుచరుడిగా ఉన్న వ్యక్తి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు దందాలో పెట్టినట్లుగా తెలుస్తోంది. సదరు ప్రజాప్రతినిధి బలం చూసుకునే మొన్నటి వరకు సదరు క్రిప్టో ఏజెంట్ పోలీసులతో పాటు, ఎవరినీ లెక్క చేయకుండా విర్రవీగాడని, అయితే మోసం వెలుగు చూడడంతో ప్రస్తుతం ఏజెంట్ జైలు ఊచలు లెక్కబెడుతున్నాడని చెబుతున్నారు. జిల్లాలోని ఆర్ఎంపీలు, జర్నలిస్టులు సైతం పెద్ద సంఖ్యలోనే క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టడంతో పాటు, బ్లాక్‌చైన్ సిస్టంను వృద్ధి చేసినట్లు పోలీసు నిఘావర్గాలు గుర్తించి విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.
క్రిప్టో కరెన్సీ దందాలో స్టార్లుగా గుర్తింపు పొంది, పెద్ద ఎత్తున నజరానాలు, వేతనాలు తీసుకొని నిబంధనలకు విరుద్దంగా చైన్ సిస్టంను పెంచిన క్రిప్టో కరెన్సీ స్టార్లను గుర్తించే పనిలో పోలీసు శాఖ బిజీబిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. చైన్ సిస్టం వ్యాపారం నిర్వహిస్తున్న వారికి స్టార్లను కేటాయించారు. స్టార్ హోదా వచ్చిన వారికి అదనపు వేతనం, పారితోషికాలు, వాహనాలు గిఫ్ట్‌లుగా ఇచ్చారు. జగిత్యాలకు చెందిన ఒక వ్యక్తి 7 స్టార్ హోదాను పొంది రూ.వందల కోట్లలో వ్యాపారం చేయడంతో పాటు, వందలాది మందిని క్రిప్టో కరెన్సీలోకి దించినట్లుగా సమాచారం. సదరు వ్యక్తిని గతంలోనూ పోలీసు శాఖకు చెందిన అధికారులు విచారించి, ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే వదిలేసినట్లుగా చెబుతున్నారు. పెద్దమొత్తంలో డబ్బులు తీసుకొని వదిలిపెట్టి ఉంటారనే ఆరోపణలున్నాయి. జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన ఓ సెవన్ స్టార్ సైతం పెద్దమొత్తంలో వ్యాపారం నిర్వహించాడు. రాయికల్ మండలానికి చెందిన ఒక రైతు సైతం ఫైవ్ స్టార్ స్థాయికి చేరుకొని పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుబడిగా పెట్టించినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి స్టార్లను గుర్తించే పనిలో పోలీసులు తలమునకలవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఏజెంట్లుగా చేరిన వారిని, క్రిప్టో దందాల్లో డబ్బులు పెట్టిన వారిని స్టార్స్ విదేశాలకు తీసుకువెళ్లి మందు, మజాలు చేయించారు. థాయిలాండ్, మక్కావ్, బ్యాంకాక్, గల్ఫ్ దేశాలకు తీసుకువెళ్లి మూడు రాత్రులు.. ఆరు పగళ్లు అన్నట్టుగా స్వర్గపుటంచులను చూపే ప్రయత్నం చేశారు. రెండేండ్ల వ్యవధిలో జిల్లా నుంచి కనీసం లక్ష మంది వరకు క్రిప్టో కరెన్సీ పేరిట విదేశాలకు వెళ్లి మ జా చేసి వచ్చారు. ఇందులో కొందరు పోలీసు అధికారులు, ప్ర భుత్వ ఉపాధ్యాయులు, వైద్యులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఉన్నారు. క్రిప్టో కరెన్సీ చైన్ దందాలను తెలుసుకునే క్ర మంలో పోలీసులు విదేశాలకు వెళ్లి మజా చేసి వచ్చిన వారిని గుర్తించి వారి ద్వారా సమాచారం సేకరించే దిశగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
క్రిప్టో కరెన్సీపై దాదాపు ఏడాదిగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఏడాది క్రితం నుంచే బాధితులు తమ ఆవేదన చెప్పుకొంటూ వస్తున్నారు. పెట్టుబడులు వస్తాయన్న నమ్మకంతో కొందరు ఎదురుచూస్తూ వచ్చారు. పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసింది తక్కువే. ఫిర్యాదులు చేసినా, లిఖిత పూర్వక దరఖాస్తులు ఇవ్వకుండా డబ్బులు ఇప్పించాలని అభ్యర్థిస్తూ వచ్చారు. అయితే, పరిస్థితి విషమించడంతో బాధితులు పోలీసు స్టేషన్లలో లిఖిత పూర్వక ఫిర్యాదులు చేస్తున్నారు ఈ క్రమంలో జగిత్యాలలో ఇప్పటి వరకు ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు కలిగిన క్రిప్టో కరెన్సీ మోసాలపై విచారణ సరిగా జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు సామాన్య జనంలో వ్యక్తమవుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో దర్యాప్తును మధ్యలోనే నీరుగార్చుతారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ క్రిప్టో కరెన్సీలో మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, దర్యాప్తు పారదర్శకంగా చేయాలని చెప్పడం, సీఎం రేవంత్‌రెడ్డి పారదర్శక విచారణ చేయించాలని కోరడం గమనార్హం. రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్న వ్యాపారమైన నేపథ్యంలో ఈ నేరాలను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, ఫెరా తదితర సంస్థలు దర్యాప్తు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.