Ramagiri | రామగిరి, మార్చి 24 : రైతులు తమ పాడి పశువులను గాలికుంటూ వ్యాధి నుంచి రక్షించేందుకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని జిల్లా పశువర్థక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్ రావు సూచించారు. రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో నిర్వహిస్తున్న గాలికుంటూ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పశువులకు గాలికుంటూ వ్యాధి సోకితే పాలు తగ్గడం, పశువులు బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ప్రతీ గ్రామంలో పశువైద్య సిబ్బంది, గోపాలమిత్రలు రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి టీకాలు వేస్తున్నారని తెలిపారు. టీకాల కార్యక్రమంలో పాల్గొన్న గోపాలమిత్ర సభ్యులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రతీ పాడి పశువుకు టీకా వేయబడేలా జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులకు టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా పశువులకు వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, గోపాలమిత్ర సభ్యులు, రైతులు పాల్గొన్నారు.