Irrigation Transfers | కలెక్టరేట్, మే 28 : నీటిపారుదల శాఖలో జరుగుతున్న సాధారణ బదిలీల్లో అధికారులు పెట్టిన లిటిగేషన్లు అర్హులైన ఉద్యోగుల బదిలీలకు ఆశనిపాతంగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కనపెట్టి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో, 317 జీవో కింద అత్యవసర సేవల కోసం ఇతర జోన్ లకు బదిలీ అయిన ఉద్యోగులు, ఆయా జోన్ లలోనే శాశ్వతంగా విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన క్రమంలో అధికారులు చేసిన తప్పిదం తమ పాలిట ఆశనిపాతమైందనే ఆవేదన ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నది. ఆయా జిల్లాలను పరిపాలనాపరమైన ‘యూనిట్ పరిధిని’ మాత్రమే చూశారు తప్ప, అసలు రాష్ట్రపతి ఉత్తర్వులను పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఉద్యోగులను వారి సొంత జోన్కు పంపించకుండా, వరంగల్ యూనిట్ పరిధిలో ఉన్నారనే సాకుతో, కనీసం ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఏదో ఒక జిల్లాకు బలవంతంగా కేటాయించారని, ఇది ముమ్మాటికీ చట్టవిరుద్ధమని మండిపడుతున్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఒక ఉద్యోగి 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఎక్కడ చదివాడనే దాన్ని బట్టే అతని స్థానికత, లోకల్ క్యాడర్ ఖరారవుతుంది. అయితే ఇందుకు విరుద్ధంగా రీఆర్గనైజేషన్ జరిగిన రోజున ఉద్యోగులు పనిచేస్తున్న కార్యాలయాన్ని బట్టి లోకల్ క్యాడర్ను నిర్ధారించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీఆర్గనైజేషన్ లో ఎక్కడైతే అలోకేట్ అయ్యారో, అక్కడే లోకల్ క్యాడర్ అవుతారంటూ అధికారులు చెబుతున్న వాదనను పూర్తిగా తప్పు పడుతున్నారు. ఇతర జిల్లాలకు కేటాయింపు అనేది కేవలం తాత్కాలిక లేదా పరిపాలనాపరమైన ప్రక్రియ మాత్రమే కానీ, అది ఒక ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కైన స్థానికతను మార్చలేదనే అంశం అధికార యంత్రాంగానికి తెలిసినా, దీని వెనుక అసలు మతలబు వేరే ఉందనే ఆరోపణలు ఉద్యోగుల నుంచి వస్తున్నాయి.
రీఆర్గనైజేషన్ సమయంలో కేవలం యూనిట్ పరిధిలోని ఆఫీసుల సీనియారిటీని బట్టి ఉద్యోగులను జోన్లకు పంపగా, కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కొత్త లోకల్ క్యాడర్లు ఏర్పాటు చేసినప్పుడు, ప్రతి ఉద్యోగికి తన సొంత జోన్కు వెళ్లేందుకు ఆప్షన్ ఫారమ్ ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆ ఆప్షన్ ఇవ్వకుండా బలవంతంగా కేటాయించి, ఇప్పుడు దాన్నే లోకల్ క్యాడర్ అనడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఇతర జోన్ల స్థానికుల హక్కులు కూడా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. అస్తవ్యస్త కేటాయింపులను వెంటనే రద్దు చేసి, ప్రతి ఉద్యోగికి తన సొంత ప్రాంతానికి వెళ్లేందుకు ఆప్షన్ ఇవ్వాలని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 95 శాతం స్థానిక కోటాను కాపాడాలని బాధిత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.