Lingapur womens protest | అంతర్గాం, జూన్ 16: సింగరేణి సంస్థ ఓసీపీ కోసం తమ భూములను త్యాగం చేశామని, తమకు ఉపాధి హామి పని తప్ప ఏమీ దిక్కు లేదని, తమ ఊరును కార్పొరేషన్లో కలపొద్దని లింగాపూర్ గ్రామ మహిళలు డిమాండ్ చేశారు. మంగళవారం అంతర్గాం మందలంలో భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించేందుకు తహసీల్దార్ రవీందర్ గ్రామానికి రాగా మహిళలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ గ్రామాన్ని మున్సిపాలిటీ కలపొద్దని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా లింగాపూర్ మాజీ సర్పంచ్ ఆర్శనపల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన భూములను ఓసిపిలో కోల్పోయామని, ఈ గ్రామంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏమీ లేవని వాపోయారు. తమ గ్రామాన్ని కార్పొరేషన్లో కలపడం అన్యాయమని, తమకు ఎలాంటి ఉపాధి లేకుండా చేయడం దారుణమన్నారు. తిరిగి తమ లింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా కొనసాగించాలని తహసీల్దార్ రవీందర్ కు వినతిపత్రం అందజేశారు.