Medical Camp | అంతర్గాం,జులై 20: ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ మహమ్మారిని తరిమికొడదామని రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామంలో శ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, వికాస తరంగిణి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య వికాస్ పర్యవేక్షణలో పెద్దంపేట గ్రామంలోని మహిళలకు గర్భకోశ సర్వైకల్ క్యాన్సర్ మెడికల్ క్యాంపు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ లాంటి మహమ్మారిని ముందస్తు పరీక్షలతో గుర్తిస్తే ప్రాణాపాయ పరిస్థితులుండవన్నారు. ముందుల ద్వారా రోగాన్ని నయం చేసుకోవచ్చన్నారు. మహిళలు తమ జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యమే మహాభాగ్యమని ముందుకు సాగి ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ఇంటికి ఇల్లాలే వెలుగు కాబట్టి మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందని, ఆ కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, ఆరోగ్య వికాస్ సేవకురాలు పద్మ, లక్ష్మి ప్రసన్నలక్ష్మి, మధుమిత ఎన్టీపీసీ వికాస తరంగిణి టీం లీడర్ దీపిక, సభ్యురాలు మాధవి, కవిత, లక్ష్మీ, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.