Jagityal | జగిత్యాల, అక్టోబర్ 1 : చట్ట ఉల్లంఘనలు బాధ్యత వహిస్తూ కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలోని వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీలు భారత ఎన్నికల కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు, ఓటర్ల నమోదు ప్రక్రియలో ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా ఖండిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని అన్నారు. దేశవ్యాప్తంగా తొలగించిన 13 కోట్ల ఓటర్లను పునరుద్ధరించాలని, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను ఉపసంహరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాజాగౌడ్‌కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, పునరుద్ధరణ, అలాగే ఓటర్ల జాబితాలు, దానికి సంబంధించిన డేటా భద్రత, నిర్వహణకు సంబంధించి బహిరంగంగా వస్తున్న వార్తలు తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని, ఈ పరిణామాలు ఎన్నికల ప్రక్రియ యొక్క పారదర్శకత, విశ్వసనీయతపై రాజకీయ పార్టీలు, పౌరులలో తీవ్ర ఆందోళనను కలిగించాయన్నారు. భారత ఎన్నికల కమిషన్ అనేది స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించే కీలకమైన బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థ మన రాజ్యాంగ ప్రజాస్వామ్య మనుగడకు దీని స్వయం ప్రతిపత్తి, విశ్వసనీయత, నిష్పాక్షికత అత్యంత అవసరమన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ఏ చర్య లేదా విధానాన్నైనా పారదర్శకంగా, రాజ్యాంగం, చట్టం, భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశాలకు అనుగుణంగా పరిష్కరించాలన్నారు. ఆరోపించబడిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు మళ్లీ నమ్మకం కలగడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ తన పదవికి రాజీనామా చేయాలని, ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే, దుర్పైవర్తన కింద ఆయనపై మహాభియోగం మోపాలన్నారు.
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, ఓటర్ల జాబితా నుండి చేసిన అన్ని తొలగింపులను పారదర్శకంగా, సరిచూసుకోదగిన విధంగా సమీక్షించాలని, అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లయితే, సరైన ప్రక్రియను అనుసరించి, వారికి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించిన తర్వాత వారి పేర్లను తిరిగి చేర్చాలన్నారు. రాజ్యాంగం, చట్టం, భారత సుప్రీంకోర్టు ఆదేశాలకు కచ్చితంగా కట్టుబడి మాత్రమే ఎన్నికల కమిషన్ కూర్పు, పనితీరును పునర్వ్యవస్థీకరించాలని, ఈ అంశాలను అత్యంత తీవ్రంగా పరిగణించి, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, బాధ్యతాయుత వాతావరణం, ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్నిల కమిషన్‌ను కోరుతున్నామన్నారు. ఈ వినతిపత్రాన్ని భారత ఎన్నికల కమిషన్‌కు పంపి, మీ పరిధిలోని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ర్ట కమిటీ సభ్యులు లెల్లెల బాలకృష్ణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఇరుగురాల భూమేశ్వర్, కార్యవర్గ సభ్యులు ఎండీ ముఖ్రం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు చింత భూమేశ్వర్, ప్రజా సంఘాల నాయకులు గుడిసెల విజయ్, గుండాలపు ధర్మయ్య తదితర జిల్లా నాయకులు పాల్గొన్నారు.