కోర్టుచౌరస్తా, డిసెంబర్ 28: న్యాయవాదులు న్యాయ శాస్ర్తాలను నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలని, అప్పుడే న్యాయ వృత్తిలో రాణిస్తారని జిల్లా జడ్జి బీ ప్రతిమ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలోని మీడియేషన్ భవన్లో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం జూనియర్ న్యాయవాదులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జూనియర్ న్యాయవాదులు న్యాయ శాస్ర్తాలపై మొదట తమ సీనియర్‌తో, తదుపరి లైబ్రరీ, ఇంటర్నెట్ ద్వారా అవగాహన పెంచుకోవాలని సూచించారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల తీర్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుండాలని తెలిపారు.
ఎకువ సమయం సీనియర్ ఆఫీస్‌తో పాటు కోర్టుల్లో ఉండేలా చూసుకోవాలని, మీ పరిశీలనకు వచ్చిన కేసుకు సంబంధించి సంబంధిత చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జూనియర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన బార్ అసోసియేషన్ సభ్యులను జిల్లా జడ్జి అభినందించారు. అనంతరం సీనియర్ న్యాయవాదులు మెట్ట అనిల్‌కుమార్, కొరివి వేణుగోపాల్ మాట్లాడుతూ, జూనియర్ న్యాయవాదుల డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, సీనియర్ల వద్ద, న్యాయమూర్తి ముందు ఎలా ఉండాలి, ఇతర అధికారులతో పాటు కక్షిదారులతో ఎలా మెలగాలి, వృత్తిలో ఎలా రాణించాలనే దానిపై అవగాహన కల్పించారు. అలాగే, జూనియర్ న్యాయవాదుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జిని శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆరెల్లి రాములు, కార్యదర్శి సిరికొండ శ్రీధర్ రావు, కోశాధికారి కొట్టె తిరుపతి, గ్రంథాలయ కార్యదర్శి పెరక శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు తేజ్‌దీప్ రెడ్డి, బెజ్జంకి శ్రీకాంత్, తిరుమల రేణుక, శివ, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.