కరీంనగర్ : శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18, 19 లను సోమవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్‌లో ఇంజినీరింగ్ కాలేజీ, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్‌లో లా కళాశాల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. ఈ రెండు కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా హుస్నాబాద్‌లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో బీటెక్ సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, ఈసీఈ బ్రాంచ్‌లను ప్రారంభించబో తున్నారు.
ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి రూ.44.12 కోట్లు కేటాయించగా అందులో రూ.29.12 కోట్లు ప్రస్తుతం మంజూరు చేశారు. మిగతా రూ.15 కోట్లను తర్వాత మంజూరు చేయనుంది. శాతావాహన వర్సిటీలో ఏర్పాటు చేయనున్న లా కాలేజీలో మూడేళ్ల కోర్సు, రెండేళ్ల కోర్సు(మేధో సంపత్తి చట్టం)లో అడ్మిషన్లు ఇవ్వబోతున్నారు. ఈ కాలేజీ నిర్మాణానికి మొత్తం రూ.22.96 కోట్లు కేటాయించగా.. అందులో ప్రస్తుతం రూ.5 కోట్లు మంజూరు చేశారు. మొత్తంగా రూ.67.08 కోట్లను ప్రభుత్వం ఈ రెండు కాలేజీలకు కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై శాతవాహన వీసీ ఉమేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఉదయం హైదరాబాదులో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు తోపాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.