మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. మాజీ ఎంపీటీసీ కుంటయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచి, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అన్నీ తానై పెద్ద కూతురు వివాహ వేడుక జరిపించి, నూతన జంటను ఆశీర్వదించారు. అలాగే మరో ఆడబిడ్డ నవిత ప్రత్యేక ఆహ్వానం మేరకు పెళ్లికి హాజరై, వధూవరులను దీవించారు. తండ్రి, అన్నను కోల్పోయిన నవితకు అన్నలా.. ఆత్మీయుడిలా ఉంటానని, బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నదని భరోసానిచ్చారు.
గంభీరావుపేట, ఆగస్టు 17 : తండ్రి, అన్నను కోల్పోయిన ఓ ఆడబిడ్డ పెళ్లికి కేటీఆర్ పెద్దన్నలా హాజరయ్యారు. ‘కేటీఆర్ అన్న నేను మీ చెల్లిని. మా నాన్న, అన్నయ్య పార్టీ కోసం పనిచేసిన్రు. కరోనా సమయంలో నాన్న, తోడుగా నిలువాల్సిన అన్న ఏడాది కింద రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. చెల్లిగా అడుగుతున్నా. ఈ నెల 17న జరిగే నా పెళ్లికి పెద్దదిక్కుగా మీరు వచ్చి ఆశీర్వదిస్తే మా నాన్న, అన్న తిరిగి వచ్చినంత ధైర్యం నాకు ఉంటుంది అన్న’ అంటూ గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన నవిత ఇటీవల కేటీఆర్‌కు సందేశం పంపింది. ఆమె సందేశానికి చలించిపోయిన కేటీఆర్, ఆదివారం పెండ్లి మండపానికి వచ్చి నూతన జంట నవిత- సంజయ్‌ను ఆశీర్వదించడంతో ఆమె ఒక్కసారిగా ఉద్వేగానికి లోనైంది. కేటీఆర్ చేయి పట్టుకుని తన నాన్న, అన్నను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నది. ఈ సందర్భంగా ‘ఏడవద్దు అమ్మా.. మనందరిదీ ఒకే కుటుంబం. ఎవరికి ఆపద వచ్చినా బీఆర్ఎస్ అండగా నిలుస్తది’ అంటూ కేటీఆర్ ఓదార్చారు. ‘ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. ఇది నాకొక ప్రత్యేకమైన అనుభూతి. అది కేవలం ఆహ్వానం కాదు. ఒక అన్నయ్యపై ఉంచిన ఆశ. పెళ్లికి వచ్చి నేను దీవించాలనే ఆ ఆడబిడ్డ కోరిక నా మనసును కదిలించింది. అందుకే బాధ్యతగా, కర్తవ్యంగా భావించి వచ్చా’ అని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజలతో ఉన్న అనుబంధం రాజకీయాలకు మించినదని, ఇలాంటి సందర్భాలు తనను ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయన్నారు.
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 17 : కాంగ్రెస్ నేతలు, పోలీసులు వేధింపులు తాళలేక తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య జూన్ 16న ఆత్మహత్య చేసుకోగా, కుంటయ్య కోరినట్టే ఆ కుటుంబానికి కేటీఆర్ అండగా నిలిచారు. ఇద్దరు కూతుర్ల చదువుతోపాటు వివాహాలు, ఇతర అన్ని విషయాల్లో తానే చూసుకుంటానని భరోసా కల్పించారు. జూలై 17న చిన్నకూతురు దీక్షితకు రూ.3లక్షల నగదును అందించి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. పెద్ద కూతురు లక్షత(భార్గవి) వివాహాన్ని ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఘనంగా జరిపించారు. పెళ్లి కోసం 5లక్షల ఆర్థిక సహాయం అందించడమే కాదు, అదనంగా పెళ్లి ఖర్చులు భరించారు. ఈ వేడుకలకు కేటీఆర్ హాజరై, నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని రామన్న భరోసాగా నిలువడంపై కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.