రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని, కొత్త సర్పంచులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకోబోమని, సమాచారం ఇవ్వగానే వచ్చి వాలే సైనికులున్నారని స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా అధికారులు గానీ, పాలకపక్ష నేతలు గానీ బెదిరిస్తే ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే పార్టీని సంప్రదించాలని సూచించారు. సోమవారం ఆయన సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు.
వేములవాడ మండలం చింతలఠాణా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మురళి గుండెపోటుతో మృతి చెందగా, ఎన్నికల్లో మాత్రం గెలిచారు. ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మాజీ వైస్ ఎంపీపీ ఆర్సీరావు తండ్రి లక్ష్మణరావు మృతిచెందగా వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఆ తర్వాత సిరిసిల్లకు చేరుకున్నారు. సీనియర్ జర్నలిస్ట్ దాసరి దేవేందర్ తండ్రి ఇటీవల చనిపోవడంతో సిరిసిల్ల వెంకంపేటలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన ఒకటి, రెండు విడుతల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులకు నిర్వహించిన ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కొత్త సర్పంచులను ఘనంగా సన్మానించారు.
వారి విధులు, బాధ్యతల విషయంలో దిశానిర్దేశం చేశారు. మూడో విడుతలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి గులాబీ జెండా ఎగురవేయాలని, అందుకు ఎన్నికైన సర్పంచులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు శక్తివంచన లేకుండా పార్టీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలని సూచించారు. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్దేనని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కొత్త సర్పంచ్‌లు ఈ ప్రభుత్వంలో పనిచేసేది ఇంకో రెండున్నరేళ్లు మాత్రమేనని, ఎలక్షన్లకు ఆరునెలల ముందు ఎలాంటి కార్యక్రమాలు ఉండవని తెలిపారు. తర్వాత రెండున్నరేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కొనసాగుతారని చెప్పారు.
మనం చేసిన పనే మనకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. సర్పంచులు కేవలం పదవులను అలంకారప్రాయంగా కాకుండా, గ్రామ అభివృద్ధికి సాధనంగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, న్యాలకొండ అరుణ, మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, బొల్లి రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతున్నది. సర్పంచ్ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యే ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలంతా మన వెన్నంటే నిలిచారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్‌లో వణుకుపుట్టింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో పల్లెలను ప్రగతిపథంలో ముందుకు తీసుకుకెళ్లారు. వందశాతం గ్రామపంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించాం. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. కానీ, రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల్లో పైసా పని చేయలేదు. కేంద్రం నుంచి 75 శాతం నిధులు వస్తాయి. ప్రతిపక్షంలో ఉంటే కొట్లాడి నిధులు సాధించుకోవచ్చు. మీరు తీర్మానం చేయకపోతే ఎమ్మెల్యే ఏమీ చేయలేడు. అధికార పార్టీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా ధైర్యంతో పోరాడి నిలిచి గెలిచిన నేతలందరికీ అభినందనలు. అదే స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర నిధులు సాధించుకుని అభివృద్ధి చేసుకుందాం. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ వంద శాతం స్థానాలను కైవసం చేసుకుని గులాబీ జెండాను ఎగరవేద్దాం.
– చల్మెడ లక్ష్మీనరసింహరావు, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి
కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గుండెల్లో పెట్టుకున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. అధికార పార్టీతో పోలిస్తే బీఆర్ఎస్కే మెరుగైన ఫలితాలు వచ్చాయి. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. వంద రోజుల్లో చేస్తామన్న ఏ ఒక్క పని చేయలేదు. రెండేళ్ల పాలనలో గ్రామాలను కూడా పట్టించుకోలేదు. పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధే కండ్లముందు కనిపిస్తున్నది. అందుకే ప్రజలంతా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారు. కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటేనే బలం ఎక్కువ. కొత్త సర్పంచులు గట్టిగ కొట్లాడి నిధులు సాధించి, గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దండి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే
మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజలు ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని చర్యలను గమనిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. నేడు గ్రామీణ స్థాయిలో అధ్వాన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడి చెత్త అక్కడే ఉంటున్నది. డీజిల్‌కు పైసలు లేక గ్రామపంచాయతీ ట్రాక్టర్లు నడుస్తలేవు. పట్టించుకునే నాథుడే లేక పల్లెల్లో పాలనంతా ఆగమైంది. కొత్తగా గెలిచిన సర్పంచ్‌లు ప్రభుత్వంతో కొట్లాడి నిధులు సాధించి పల్లెలను మళ్లీ అభివృద్ధి పథంలో నడపాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు తెచ్చి ఆదర్శవంతమైన పాలన అందించాలి. అధికార పార్టీ నుంచి ఏ సమస్య వచ్చినా రామన్నతో పాటు మేమంతా మీ వెంట నిలుస్తాం. అధైర్యపడేది లేదు. ధైర్యంగా ముందుకు వెళ్లండి. పంచాయతీ ఫలితాలతో ప్రజల మనసులో మనమే ఉన్నామని తేలిపోయింది. రెండేండ్ల తర్వాత మన పార్టీయే అధికారంలోకి వస్తుంది.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు