కోరుట్ల/ మారుతీనగర్, నవంబర్ 13 : రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తానని, ఎవరెన్ని విమర్శలు చేసినా తగ్గేదిలేదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ధైర్యంగా నిలదీస్తామని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలు ప్రభుత్వానికి నివేదించేందుకు పాదయాత్ర చేపట్టామని, ప్రభుత్వాన్ని కదిలించామని, పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు. పార్టీలకతీతంగా పాదయాత్రను విజయవంతం చేసిన రైతులతోపాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
బుధవారం కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో వేర్వేరుగా నిర్వహించిన విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసులు, పగలు, పైరవీలతో పాలనను పక్కన పెట్టారని, విద్య, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ధాన్యం కొనుగోళ్లపై చిత్తశుద్ధి లేదని, సన్నబియ్యం కొన్న దాఖలాలు లేవని మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో గతేడాది బీఆర్ఎస్ పాలనలో 4 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరిగితే, ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 30 వేల క్వింటాళ్లే కొన్నారని చెప్పారు.
రైతులు ఇప్పటికే దళారులను ఆశ్రయించి 2 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకొని 100 కోట్లు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర ద్వారా రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేశారని, అప్పుడెలా ఉండే.. ఇప్పుడిలా అయిందని తమ గోడును వెల్లబోసుకున్నారని వివరించారు. ప్రజలపై ప్రేమ, జవాబుదారీతనంతో సమస్యలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేశానని, కానీ, రాజకీయాల కోసం చేసే అవసరం లేదన్నారు. పాదయాత్ర సందర్భంగా కోరుట్లలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించడంపై మండిపడ్డారు.
కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిన వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, మెట్పల్లి మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, కౌన్సిలర్ పురుషోత్తం, కోరుట్ల నియోజకవర్గ యూత్ నేత ఒజ్జెల శ్రీనివాస్, మల్లాపూర్ మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ కోరుట్ల పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు చీటి వెంకటరావు, కాశిరెడ్డి మోహన్‌రెడ్డి, అన్వర్, అస్లాం, పొట్ట సురేందర్, గంగాధర్, నవీన్ పాల్గొన్నారు.