మెట్పల్ల్లి, మార్చి 18 : నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గళమెత్తారు. మంగళవారం జీరో అవర్లో పలు అంశాలను ప్రస్తావించి, ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభు త్వం ఏర్పడి పదిహేను నెలలవుతున్నా ఒక్క రూపాయి కూడా విడుదల కావడం లేదని అన్నా రు. తమ నియోజకవర్గంలో కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలు ఉన్నాయని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కోసం రూ.15 కోట్ల చొప్పున నిధులు కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం చెప్పులు అరిగేలా తిరిగినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని వాపోయారు. వెంటనే సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలని కోరారు.
మెట్పల్లి ప్రభుత్వ దవాఖాన భవనం శిథిలావస్థకు చేరడంతో పెచ్చులూడుతుందని పలుసార్లు వైద్యారోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా నిధులు మంజూరు కావడం లేదన్నారు. మల్లాపూర్ మండలం మొగిలిపేటలో 350 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారు కలెక్టర్కు ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తే వాళ్లని అరెస్ట్ చేయించడం సరైందేనా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే వారిని ప్రభుత్వం ముందస్తు అరెస్ట్ చేయిస్తున్నదని విమర్శించారు.
రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందో లేదో అనేది ప్రభుత్వం ఒకసారి సరిచూసుకోవాలని సూచించారు. మల్లాపూర్ మండలం రేగుంట మాటు కాలువకు 2 కోట్ల నిధులు కేటాయించి మరమ్మతులు చేయిస్తే సుమారు రేగుంట, వేంపల్లి గ్రామాల్లోని 2 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం తమ నియోజకవర్గంపై దృష్టి పెట్టి అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని కోరారు.