మెట్పల్లి టౌన్, అక్టోబర్ 6: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రజాపాలన చేతకావడం లేదని, అన్ని వర్గాల వారిని మభ్యపెడుతూ తెలివిగా ముందుకెళ్తున్నాడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచిపోయారని, రాష్ట్ర ప్రజలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను కనీసం వారిని ఓదార్చి, పరిహారం అందించలేని అసమర్థ పాలకుడు ఆయన మండిపడ్డారు.
రేవంత్ ఆలోచన లేని విధానాలతో రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారని, రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. మెట్పల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలే వర్షాలకు పంట నష్టపోయి అన్నదాతలు, కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ప్రతిరోజూ రోడ్లపై ఆరబోస్తూ.. సాయంత్రం అయితే కుప్పలు చేస్తూ నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన చెందారు.
ఇప్పటికైనా మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి త్వరితగతిన కొనుగోళ్లు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీసీలపై ఎంతో ప్రేమ చూపుతున్నట్టు నాటకం ఆడుతున్నదని మండిపడ్డారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు అందించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. కొత్త పింఛన్ల జోలి కూడా తీయడం లేదని, రూ. 500కు సిలిండర్ నెలకే పరిమితమైందని, ఇందిరమ్మ ఇల్లు ఆశ చూపి కేవలం పదుల సంఖ్యలో కేటాయించి, అవి కూడా పూర్తి చేయడంలో లబ్ధిదారులను నానా ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్ధితుల్లో లేరని, ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి మాటలు చెప్పడం మానేసి చేతల్లో చూపించాలని డిమాండ్ చేశారు.