Konda Laksamam Bapuji | కరీంనగర్, తెలంగాణ చౌక్ 28 : తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు, మాజీమంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీనీ తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు రాపోలు జ్ఞానేశ్వర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ వాసాల రమేష్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు మెతుకు సత్యం అన్నారు. కరీంనగర్ లోని పద్మశాలీ సంక్షేమ ట్రస్ట్ భవన్లో బుధవారం కొండా లక్ష్మణ్ బాపూజీ పోస్టర్ ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ క్రియాశీలక పాత్ర పోషించాడని, ఆంధ్ర మహాసభకు నాయకత్వం వహించాడని అన్నారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప నాయకుడనీ అన్నారు. బీసీ ఉద్యమ నిర్మాతగా, సహకార సంఘాల వ్యవస్థాపకుడిగా, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పేరును సంపాదించుకున్నాడని కొనియాడారు. 1952 -1970 వరకు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలు అందించాడనీ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 1969లో మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడనీ గుర్తు చేశారు. తెలంగాణ మొదటి దశలో ఉద్యమంలో 87 ఏళ్ల వయసులో తెలంగాణ కోసం ఉద్యమాలు చేపట్టాడని అన్నారు.
తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయుడని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వస్వం త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి అని అన్నారు. బాపూజీ రాష్ట్రానికి చేసిన సేవలు ప్రభుత్వం గుర్తించి జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాతిపితగా కొండా లక్ష్మణ్ బాపూజీ ని గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రిని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2న తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో అన్ని కులాలకు చెందిన వారు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వోల్లాల కృష్ణహరి, కోశాధికారి అల్స భద్రయ్య, పోపా జిల్లా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ, నాయకులు జె ల్ల నరేందర్, రవికుమార్, అను మల్ల రాజు, పాము రాజేశం తదితరులున్నారు.