Kolanuru railway station platform | ఓదెల, జులై 14 : దక్షిణ మధ్య రైల్వే లోని కాజిపేట్-సిర్పూర్ కాగజ్ నగర్ సెక్షన్ లో కొలనూర్ రైల్వేస్టేషన్లోని ప్లాట్ ఫామ్ లో అధ్వానంగా మారాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలు చెందుతున్నారు. ఇక్కడి ప్లాట్ ఫామ్ ఆధునీకరణలో భాగంగా చేసిన అభివృద్ధి పనులలో నాణ్యత లేని కారణంగా ప్లాట్ ఫామ్ పై సిమెంట్ గచ్చు లేచిపోయింది. దీంతో ప్లాట్ ఫామ్ పై ముళ్ల పొదలు గడ్డి, పిచ్చి మొక్కలు మొలిచి చిన్నపాటి అడవిని తలపిస్తోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గడ్డి, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఉన్నాయి. ఫ్లాట్ ఫామ్ పై తేళ్లు, పాములు తిరుగుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. రాత్రివేళ ప్లాట్ ఫామ్ లపై ఉండడానికి ప్రయాణికులు జంకుతున్నారు.
రాత్రి సమయంలో పూర్తిస్థాయిలో కరెంటు బల్బులు లేని కారణంగా చీకట్లోనే ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాట్ ఫామ్ లు శుభ్రంగా ఉండేలా రైల్వే శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్లాట్ ఫామ్ పై గడ్డి పెరగడంతో పాటు ఉడ్చిన చెత్తాచెదారాన్ని కూడా ప్లాట్ ఫామ్ పైనే పడేస్తున్నారు. ప్లాట్ ఫామ్ అధ్వానంగా ఉన్నా రైల్వే శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. పరిశుభ్రంగా ఉండాల్సిన రైల్వే స్టేషన్ పరిసరాలు చెత్తాచెదారంతో ఉండడం విచారకరం.