రామగిరి, అక్టోబర్ 6 : బాయిలర్ కోళ్లు తినీ తిని విసుగెత్తి పోయారో… ఏమో గానీ.. కడక్‌నాథ్ కోళ్ల కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. మండలంలోని సెంటినరీకాలనీలో తమిళనాడుకు చెందిన వ్యాపారులు పెద్ద ఎత్తున కడక్‌నాథ్, టర్కీ కోళ్లను తీసుకవచ్చి విక్రయించగా, స్థానికులు కొనుగోలు చేసేందుకు తరలివచ్చారు. రుచికి రుచితోపాటు పోషక విలువలు మెండుగా లభించే ఈ కోడి మాంసంకు మార్కెట్లో భలే గిరాఖీ ఉంది. కాగా, మూడు కిలోల బరువు ఉన్న కోడిని రూ.600 నుంచి రూ.800 వరకు విక్రయించారు.
ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ రకం కోళ్లను కొనేందుకు ఆసక్తి చూపారు. కోళ్ల పెంపకం కూడా సులభతరం కావడంతో ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు. అరుదైన ఔషధ లక్షణాలు కలిగి ఉండే ఈ కడక్‌నాథ్, టర్నీ కోళ్లకు బయట కిలో మాంసం రూ.వెయ్యి ధర పలుకుతోంది. ఐతే తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో తీసుకవచ్చిన కోళ్లను రూ.800 చొప్పున విక్రయించారు. రోగ నిరోధక శక్తి కలిగిన పెరటి జాతి నాటుకోడిగా వీటికి పేరుంది.