శంకరపట్నం, అక్టోబర్ 1: కాలం గడుస్తున్నా కేశవపట్నం రోడ్డు విస్తరణ కలగా మిగిలింది. పేరుకు మండల కేంద్రమే అయినా కేశవపట్నం గ్రామంలో రోడ్డు కనీసం ఎడ్ల బండి ప్రయాణానికి కూడా అనువుగా లేని దుస్థితి నెలకొన్నది. పాత జీపీ కార్యాలయం నుంచి జడ్పీ ఉన్నత పాఠశాల వరకు దాదాపు 600 మీటర్ల పొడవున కేవలం ఒక్క వాహనం వెళ్లేంత వెడల్పుతో మాత్రమే దారి ఉండగా, ఎదురుగా ఏదైనా మరో నాలుగు చక్రాల వాహనం వస్తే అంతే సంగతులు. ఏదో ఒకటి వెనుకకు రివర్స్ గేర్ వేయాల్సిందే.
కేశవపట్నం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి గ్రామం గుండా నిత్యం వందల వాహనాలు వెళ్తుంటాయి. ఈ దారి గుండా హుస్నాబాద్, సిద్దిపేట, హైదరాబాద్ వరకు వెళ్లవచ్చు. నుస్తులాపూర్ మీదుగా సిద్దిపేట, హైదరాబాద్, తదితర ప్రాంతాల వైపు వెళ్లే వాహనదారులకు దాదాపు 15 కిమీ దూరం తగ్గుతుంది. గతంలో ఈ దారి గుండా ఆర్టీసీ మూడు సార్లు బస్సులు నడిపినా ఇరుకైన రోడ్డు వల్ల అర్ధాంతరంగా సర్వీసులు నిలిచిపోయాయి. ఊరి నడుమ కనీసం రెండు ఆటోలు కూడా సులభంగా వెళ్లలేని పరిస్థితి ఉన్నది. పలు సందర్భాల్లో ఎదురెదురుగా వాహనాలు వచ్చినపుడు ముందుకు, వెనుకకు వెళ్లలేక గంటల తరబడి ట్రాఫిక్ జాం ఏర్పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గత నవంబర్ 11న లారీ, హార్వెస్టర్ ఎదురెదురుగా వచ్చి ట్రాఫిక్ జాం కాగా, అందులో ఓ 108 అంబులెన్స్ ఇరుక్కుపోయి గంటకు పైగా పేషెంట్ ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రోడ్డు విస్తరణ సమస్య హాట్ టాఫిక్‌గా మారుతున్నది. సర్పంచ్ మొదలు ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరూ రోడ్డు విస్తరణకు హామీ ఇస్తున్నా నేటికీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. గ్రామ పంచాయతీ తీర్మానాలు, అధికారుల ఆదేశాలు అన్నీ బుట్టదాఖలే అయ్యాయి. ట్రాఫిక్ జాం అయిన ప్రతిసారి గ్రామస్తులు సోషల్ మీడియా వేదికగా తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూనే ఉన్నారు. అయితే ఈసారి మాత్రం పలువురు యువకులు కాస్త గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా రోడ్డు విస్తరణకు ఎవరు చిత్తశుద్ధితో కూడిన హామీ ఇస్తారో వారికే తమ ఓటని క్లియర్‌గా చెబుతున్నారు. మాట నిలబెట్టుకోపోతే నిలదీయక తప్పదని మరీ హెచ్చరిస్తున్నారు.
ఎన్నో ఏండ్లుగా రోడ్డు విస్తరణ కోసం ఎదురు చూస్తున్నం.. ఇప్పటికీ తాతల కాలం నాటి రోడ్డు మీదనే తిరుగుతున్నం. నాయకులు వస్తున్నారు, పోతున్నారు. రోడ్డు విస్తరణ మాత్రం కలగానే మిగిలింది.. ఇక మాకు ఓపిక లేదు.. యువకులం అంతా ఇప్పటికే నిర్ణయించుకున్నం.. అతి కొద్ది మంది అభ్యంతరాలతో రోడ్డు విస్తరణ ఆపడం సరికాదు.. రోడ్డు విస్తరణ చేసే వారికే ఓటు వేస్తాం.. ఏదో ఎన్నికల్లో గెలవడం కోసమే హామీలు ఇస్తాం అనుకునే వారికి మాదో హెచ్చరిక.. రోడ్డు విస్తరణ మీ వల్ల అయితేనే హామీ ఇవ్వండి.
-మార్క లక్ష్మణ్, స్థానికుడు
గతంలో కేశవపట్నం రోడ్డు పీఆర్ రోడ్డు విభాగంలో ఉండేది. అప్పట్లో 2017లో జీపీ తీర్మానం మేరకు రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయే వారికి నోటీసులు జారీ చేశాం. కొంత మంది ఇండ్ల యజమానులు స్వచ్ఛందంగా అంగీకారం తెలుపగా, మరికొందరు తమకు వేరే చోట ఇల్లు ఇస్తేనే వైదొలగుతామని అభ్యంతరం తెలిపారు. అప్పట్లో అధికారులు దీనిపై ఓ నివేదికను కూడా కలెక్టర్‌కు పంపించారు. కాగా, ఇటీవల మరోసారి జూలైలో నోటీసులు జారీ చేశాం. తిరిగి కొంత మంది అవే అభ్యంతరాలు చెప్పారు. దీంతో రోడ్డు విస్తరణ ప్రక్రియ నిలిచిపోయింది.
– ఎంపీడీవో కృష్ణప్రసాద్