కరీంనగర్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : సమష్టి కృషి, అంకిత భావం, పారదర్శకత, నిజాయితీ, నిబద్ధతే కేడీసీసీ బ్యాంకును ఈ స్థాయికి చేర్చాయని, 20 ఏండ్లలో దేశం దృష్టిని ఆకర్శించే స్థాయికి బ్యాంకు ఎదిగిందని ఆ బ్యాంక్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు స్పష్టం చేశారు. శనివారం కరీంనగర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సత్కార సభలో ఆయన మాట్లాడారు. 2005లో తాను మొదటిసారి బ్యాంక్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు సహకార వ్యవస్థ పరిస్థితి అధ్వానంగా ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో మూసివేతకు సిద్ధంగా ఉన్న 22 బ్యాంకుల్లో కరీంనగర్ కూడా ఉందని, అప్పుడు కేవలం రూ.400 కోట్ల వ్యాపారం మాత్రమే ఉండేదని, ప్రస్తుతం రూ.8,100 కోట్లకు వ్యాపారం పెంచామని, రూ.990 కోట్ల డిపాజిట్లు సేకరించి, 8 లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందించగలుగుతున్నామని స్పష్టం చేశారు.
మా సక్సెస్‌కు 99 శాతం రికవరీతోపాటు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం, బ్యాంకును పూర్తిగా కంప్యూటరీకరించడం, పారదర్శకత పాటించడం, ఇలా అవకాశాలన్నింటినీ వినియోగించుకుని బ్యాంకును వృద్ధిలోకి తెచ్చామని, ఇది తన ఒక్కడి కృషి కాదని, పాలకవర్గాలు, ఉద్యోగుల కృషి ఉందని చెప్పారు. ఉద్యోగులకు వేతనాలు పెంచామని, కొత్తగా 4 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నామన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ప్రతినిధులు వచ్చి కేడీసీసీబీ అభివృద్ధిపై అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. నీతి అయోగ్, నాబార్డ్ వంటి సంస్థలు కూడా కేడీసీసీబీని అధ్యయనం చేశాయని తెలిపారు.
రైతులకు 28 శాతం వాటా కల్పించి కమర్షియల్ బ్యాంక్‌ల కంటే సహకార బ్యాంకులు ముందున్నాయన్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ బ్యాంక్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రవీందర్రావు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సహకార సంఘాలకు తాను, రవీందర్రావు ఒకేసారి వచ్చామని, తాను మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా, రవీందర్రావు కేడీసీసీబీ చైర్మన్‌గా సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా పంట రుణాలకే పరిమితం కాకుండా అన్ని రకాల రుణాలను అందించి ప్రజల మన్ననలు పొందారన్నారు.
‘ఆకుపచ్చ చందమామ నువ్వేలే’ అనే పాటను పాడి అందరినీ అలరించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ దేశానికే ఆదర్శంగా సహకార రంగాన్ని తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మాట్లాడుతూ ఏకధాటిగా 20 ఏళ్లు సహకార బ్యాంకు చైర్మన్‌గా ఉండి అంతర్జాతీయ స్థాయిలో 8 సార్లు అవార్డును తీసుకొని దేశంలోనే కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకును ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత కొండూరుదే అన్నారు.
మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ 2005లో రూ.58 కోట్ల నష్టాల్లో ఉన్న కరీంనగర్ డీసీసీబీని 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.120 కోట్ల లాభాలు ఆర్జించే సంస్థగా ఎదిగేందుకు కృషి చేసిన కొండూరు బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ మొదట్లో సహకార బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకంగా ఉండగా, అలాంటిది దాని స్వరూపాన్ని మార్చి లాభాల బాటలో పయనింపచేశారని కొనియాడారు.
డైయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ డెయిరీకి 24 గంటల్లోనే లోన్ అవసరం ఉండగా, రూ.68 కోట్ల వరకు సహకార బ్యాంకు ద్వారానే అందించారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు టీ జీవన్‌రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ ప్రసంగించగా, సీఈవో సత్యనారాయణరావు, సిరిసిల్ల జడ్పీ మాజీ చైర్పర్సన్ అరుణ, సురేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, ఆగయ్య, శ్రీకాంత్‌రెడ్డి, వేసిరెడ్డి దుర్గారెడ్డి, తీపిరెడ్డి కిషన్‌రెడ్డి, జలగం కిషన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.