కార్పొరేషన్/హుజూరాబాద్ టౌన్/ రూరల్/ ఇల్లందకుంట/ సైదాపూర్/ గంగాధర/ శంకరపట్నం/ గన్నేరువరం, మార్చి12: కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ కదనభేరి సభ విజయవంతమైంది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గులాబీ దండుతోపాటు అభిమానులు, ప్రజానీకం స్వచ్ఛందంగా లక్షకు పైగా తరలివచ్చి పార్టీ అధినేత కేసీఆర్‌పై ఎనలేని అభిమానాన్ని చాటింది. గులాబీ జెండాల రెపరెపలు.. జై బీఆర్ఎస్ నినాదాలతో గ్రామాలు మార్మోగగా, సభా విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి సుమారు 25వేల మంది స్వచ్ఛందంగా తరలి వెళ్లగా, వారి వెంట హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లతో పాటు, పీఏసీఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, ఎంపీపీ ఇరుమల్ల రాణి-సురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గూడూరి ప్రతాప్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు ఐలయ్య ఉన్నారు. ఇల్లందకుంట నుంచి తరలివెళ్లిన వారిలో పీఏసీఎస్ వైస్ చైర్మన్లు కందాల కొమురెల్లి, ఉడుత వీరస్వామి, ఎంపీటీసీ విజయకుమార్, నాయకులు రాజిరెడ్డి, కుమార్, రత్నాకర్, సంపత్, వేణు, రమేశ్, రాజిరెడ్డి, చంద్రయ్య, సంపత్, సమ్మిరెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.
సైదాపూర్ మండలం నుంచి సుమారు 3500 మంది సభకు తరలివెళ్లగా, వారి వెంట జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి చెల్మల్ల రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. గంగాధర మండలంలోని 33 గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలివెళ్లగా, అంతకుముందు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో మధురానగర్ చౌరస్తా గులాబీమయమైంది. గన్నేరువరం, శంకరపట్నం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. మానకొండూర్ మండలం ముంజంపల్లి నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు వాహనాల్లో కదనభేరి సభకు బయలుదేరగా, మాజీ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. చిగురుమామిడి మండలం నుంచి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వాహనాల్లో తరలి వెళ్లాయి. సభకు తరలిన వారిలో ఎంపీపీ కొత్త వినీత, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, మండల నాయకులు తిరుపతి, సర్వర్ పాషా, దుడ్డెల లక్ష్మీనారాయణ, సన్నిల్ల వెంకటేశం, గ్రామాధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు ఉన్నారు.
ఎల్ఎండీలో కేసీఆర్
తిమ్మాపూర్, మార్చి12: కరీంనగర్ కదనభేరి సభకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ వెళ్తూ ఎల్ఎండీలోని ఎస్సారెస్పీ గెస్ట్ హౌస్‌లో కొద్దిసేపు విడిది చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మండల నాయకులు, తదితరులు ఆయనను కలిసి సత్కరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలో పార్టీ పరిస్థితిపై రావుల రమేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. వినోద్ కుమార్ గెలుపు కోసం కష్టపడాలని నాయకులకు సూచించారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు ఉన్నారు.
‘కదనభేరి’ సైడ్ లైట్స్
కార్పొరేషన్/కమాన్‌చౌరస్తా/కలెక్టరేట్/తెలంగాణచౌక్, మార్చి 12: కదనభేరి సభ జనసంద్రమైంది. సాయంత్రం నాలుగు గంటలకే ఎస్సారార్ కళాశాల మైదానం జనంతో నిండిపోయింది.
బీఆర్ఎస్ గెలుపు ఇప్పుడే అవసరం
పదేళ్ల పాలనలో తెలంగాణలో సాగునీటి సమస్య, కరెంటు సమస్య అన్నది లేకుండా పోయింది. కానీ, కాంగ్రెస్ వచ్చిన మూడు నెలలకే కరెంటు సమస్యలు వస్తున్నయి. నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నయి. మరోసారి తెలంగాణ గళాన్ని మరింత బలంగా వినిపించేందుకు కేసీఆర్ సర్ కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానాన్ని ఎంచుకోవడం రాష్ట్ర ఉద్యమ సమయాన్ని గుర్తు చేసింది. నిజంగా అప్పటి సభ దృశ్యాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నయి. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ బలంగా ఎందుకు ఉండాలో అర్థమవుతున్నది.
– చంద్రశేఖర్, కరీంనగర్ (కార్పొరేషన్)
వినోద్‌కుమార్‌ను గెలిపించుకుంటం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో లేదో కరెంటు పోతున్నది. పంటలకు సాగునీరు లేకుండా పోయింది. మరి ఇన్నాళ్లు కేసీఆర్ ఎలా ఇచ్చారు. అది కూడా తెలుసుకోకపోతే ఎలా?. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఎంతో అవసరం. ఇప్పుడు వీళ్లు ఉంటేనే ప్రభుత్వంపై పోరాటం చేస్తరు. లేకపోతే ఎవరు మాట్లాడుతరు?. ఎక్కడికక్కడ మళ్లీ పాత రోజులే వచ్చేలా ఉన్నయి. అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను గెలిపించుకుంటం.
– మామిండ్ల అంజయ్య, రాజన్న సిరిసిల్ల (కార్పొరేషన్)
ఉద్యమ స్ఫూర్తి ఇప్పటికీ ఉంది
ఎస్సారార్ కళాశాల మైదానంలో తెలంగాణ కోసం ఏ స్థాయిలో అయితే సింహగర్జన జరిగిందో ఇప్పటి సభ కూడా అదే తీరులో జరిగింది. రాష్ట్రం రాకముందు ఉన్న పరిస్థితులే ఇప్పుడు వస్తున్నాయా అన్నట్లుగా మారింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ సభకు కరీంనగర్ నుంచే మళ్లీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించడం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ఎన్నికల్లో వినోద్‌కుమార్‌ను ఎంపీగా గెలిపించుకునేందుకు కృషి చేస్తాం.
– శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్(కార్పొరేషన్)