కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 7 : కేవలం మహిళా సంఘాల సమావేశాల కోసం నిర్మించిన భవనంలో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ఏర్పాటు చేయాలని కరీంనగర్ జిల్లా యంత్రాగం నిర్ణయించింది. అయితే, కనీస సదుపాయాలు కల్పించకుండానే తరలిస్తే సిబ్బందితోపాటు నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డలోని ఈ-సేవా కేంద్రం పైఅంతస్తులో గతంలో స్థానిక మహిళా సంఘాలు సమావేశాలను నిర్వహించుకునేందుకు వీలుగా ఒక హాల్, మరొక గది నిర్మించారు.
మహిళా సంఘాలు నెలలో ఒక్కటి, రెండు సార్లు తమ సమావేశాలు నిర్వహించేది. అయితే, దానిని ప్రస్తుతం వినియోగించడం లేదు. కాగా, ప్రస్తుతం ఎస్ఆర్ఆర్ కళాశాల ఎదుట ఉన్న ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌ను ఇక్కడికి తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం ఉన్న స్థలాన్ని జిల్లా న్యాయ విభాగానికి ప్రభుత్వం కేటాయించింది. ఈ స్థలంలో జిల్లా న్యాయ విభాగానికి చెందిన జడ్జిలు, ఇతర అవసరాల కోసం నిర్మాణాలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో అక్కడ ప్రస్తుతం ఉన్న ఉపాధి కల్పన కార్యాలయాన్ని తరలించడం తప్పనిసరిగా మారింది.
అయితే, కశ్మీర్‌గడ్డలోని ఈ-సేవ కేంద్ర భవనంలో కనీసం మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి సదుపాయం కూడా లేవు. కనీసం పార్కింగ్ సదుపాయం కూడా లేదు. ఇలాంటి భవనంలోకి ఈ కార్యాలయాన్ని తరలిస్తే సిబ్బందితోపాటు అక్కడి వచ్చే నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉన్న ఒక హాల్లో కార్యాలయాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు, కలెక్టర్ దృష్టి సారించి సౌకర్యాల కల్పన విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.