కొత్తపల్లి, అక్టోబర్ 19 : మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యోగా క్రీడాకారులు అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగే జాతీయ స్థాయి యోగా చాంపియన్‌షిప్ పోటీల్లో పతకాల పంట పండించాలని, రాష్ట్ర కీర్తి పతాకాన్ని నలుదిశలా చాటాలని రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ సూచించారు. కరీంనగర్ జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో మానేరు విద్యాసంస్థలు, రైస్ మిల్లర్స్ సంఘం సౌజన్యంతో రెండు రోజుల పాటు కరీంనగర్ పద్మనగర్‌లోని మానేర్ సెంట్రల్ సూల్ ఆవరణలో జరుగుతున్న 10వ రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలు గురువారంతో ముగిశాయి.
సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో జాతీయస్థాయి యోగా పోటీలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, నిర్వహణ బాధ్యతలను కరీంనగర్‌కు వచ్చే విధంగా చూడాలని రాష్ట్ర సంఘాన్ని కోరారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒకరూ యోగా చేయాలన్నారు. ఎందరో యోగా క్రీడాకారులు స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లా వరుసగా చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్యాట్రన్, మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర యోగా పోటీలు ప్రశాంతమైన వాతావరణంలో దిగ్విజయంగా జరిగాయన్నారు.
ఎలాంటి ఆటుపోట్లు లేకుండా నిర్వహించిన యోగా సంఘం బాధ్యులను, రెఫరీలను ఈ సందర్భంగా ఆయన అభినంధించారు. యోగా సంఘం రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు జే మనోహర్‌కుమార్, నాగిరెడ్డి సిద్దారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో మొదటి, మూడు స్థానాలు సాధించిన క్రీడాకారులను నవంబర్ 23 నుంచి 26 వరకు అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరుగనున్న జాతీయస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయస్థాయి యోగా క్రీడాకారులకు కొదువలేదన్నారు. అనంతరం విజేత జట్లకు ట్రోఫీలు, పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సం ఘం ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, రాష్ట్ర యోగా సంఘం బాధ్యులు కమలాకర్, బాలరాజు, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.
పదో రాష్ట్రస్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్‌ను కరీంనగర్ జిల్లా జట్టు కైవసం చేసుకొంది. ఎనిమిదేళ్ల వయస్సు విభాగం నుంచి 45 ఏళ్ల వయస్సు విభాగాల్లో బాలబాలికలు, పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలను నిర్వహించగా, అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచి చాంపియన్‌గా నిలిచింది. మొత్తం 34 పాయింట్లు సాధించి 9వ సారి చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొని రికార్డ్ సృష్టించింది. రంగారెడ్డి జిల్లా జట్టు క్రీడాకారులు 22 పాయింట్లు సాధించి ద్వితీయ చాంపియన్‌షిప్‌ను, మహబూబ్‌నగర్ జిల్లా జట్టు క్రీడాకారులు 16 పాయింట్లు సాధించి తృతీయ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.