కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 21 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒకరూ కృషి చేయాలని, ఇందులో భాగంగా బాధ్యతగా మొక్కలు నాటి వాతావరణాన్ని కాపాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం కరీంనగర్లో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్లో 75వ స్వతం త్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు గత 15 రోజులుగా ఒక్కో సేవా కార్యక్రమంతో ప్రజల్లో జాతీయ భావం, దేశభక్తిని పెంచేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో ఇప్పటికే హరితహారంలో భారీ సంఖ్యలో మొకలు నాటి సంరక్షించామన్నారు. ఇంకా నగరంలో ఉన్న స్థలాల అనుకూలతను బట్టి మొకలు నాటుతామని చెప్పారు. కరీంనగర్‌ను హరిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించి భావి తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్‌రావు, కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్ శ్రీకాంత్, నగరపాలక అధికారులు, నాయకులు పాల్గొన్నారు.