cordon search | గంగాధర, ఆగస్టు 11: గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో సోమవారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా చౌరస్తాలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటస్వామి మాట్లాడుతూ మధురానగర్ చౌరస్తా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పేర్కొన్నారు.
మధురానగర్ చౌరస్తా నుండి కొండగట్టు వరకు ఉన్న ప్రాంతంలో అక్రమంగా గంజాయి సరఫరా జరుగుతున్నట్లు తెలిపారు. చౌరస్తాలో ఫేక్ ఐడీలతో కిరాయికి ఉంటున్న వారు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. చౌరస్తాలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 90 వాహనాలను గుర్తించినట్లు, ఇంత పెద్ద మొత్తంలో వాహనాలను గుర్తించడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.
అనంతరం ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల, చైల్డ్ ఫోర్నోగ్రఫీ, ఆన్లైన్ బెట్టింగ్, షీ టీం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. చుట్టుపక్కల అసాంఘిక కార్యక్రమాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం మత్తు పదార్థాల నివారణ పై వాల్ పోస్టర్ ఆవిష్కరించి, గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. సీఐలు ప్రదీప్‌కుమార్, శ్రీలత, కోటేశ్వరరావు, సదన్‌కుమార్, కె సంజీవ్, పుల్లయ్య, ఎస్ఐలు వంశీకృష్ణ, నరేందర్ రెడ్డి, వీ పుల్లయ్య, రాజు, సాయికృష్ణ, సయ్యద్ అన్వర్, లక్ష్మారెడ్డి, నరేష్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.