కార్పొరేషన్, మార్చి 31 : కరీంనగర్ నగరపాలక సంస్థ బడ్జెట్ సాధారణ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. నూతన పాలకవర్గ సభ్యులు తమ డివిజన్లలోని సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా పారిశుధ్యం, నీటి సరఫరా, కోతులు, కుక్కల బెడద, వీధిదీపాలు తదితర సమస్యలను సభ ముందుకు తీసుకువచ్చారు. వీటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు పారిశుధ్య విభాగంలో అవినీతి, కాంట్రాక్టు ఉద్యోగులపై ఫిర్యాదులు, టౌన్ ప్లానింగ్‌లో అవినీతి దందా తదితర అంశాలపై సభ్యులు నిలదీశారు.
నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో మంగళవారం ఉదయం 11 గంటలకు మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం ప్రారంభం కాగా, పలువురు సభ్యులు మాట్లాడారు. గతేడాది కంటే ఈ సారి అంచనా బడ్జెట్ తగ్గించడంపై నిలదీశారు. మున్సిపల్ నిబంధనల మేరకు మాత్రమే బడ్జెట్ తయారు చేసినట్లు కనిపిస్తుందే తప్ప వచ్చే ఆదాయాలకు అనుగుణంగా రూపొందించినట్లు కనిపించడం లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్ రవీందర్‌సింగ్ విమర్శించారు. గతేడాది అంచనా బడ్జెట్ ఈ సంవత్సరం సవరించిన బడ్జెట్‌ను చూస్తే వాస్తవాలకు ఆమడ దూరంలో ఉందని కాంగ్రెస్ కార్పొరేటర్ అంజన్‌కుమార్ అన్నారు. కార్పొరేషన్‌కు ఆదాయం సమకూర్చుకునే అనేక మార్గాలు ఉన్నా అంకెల గారడీ చేశారే తప్ప వాస్తవంగా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. టీఎన్జీవో షాపింగ్ కాంప్లెక్స్, రెవెన్యూ క్లబ్‌ల నుంచి ఎందుకు పూర్తిస్థాయిలో పన్నులు వసూళ్లు చేయడం లేదని సభ్యులు అంజన్, రవీందర్‌సింగ్, జయశ్రీ తదితరులు ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే నిధులను వరదలా తీసుకువచ్చి విలీన గ్రామాల డివిజన్లతో పాటు నగరాన్ని అభివృద్ధి చేస్తానన్నాడని, కానీ ఈ బడ్జెట్లో ఆ వరద కనిపించడం లేదని విమర్శించారు. దీనిపై స్పందించిన బీజేపీ సభ్యులు.. తాము ఇప్పటికే స్మార్ట్‌సిటీ కింద నిధులు తీసుకువచ్చామంటూ చెప్పుకొచ్చారు. విలీన డివిజన్లలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నిధులను కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టాలని సభ్యులు కోరారు. వీధుల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయని, వీధిదీపాలను సత్వరమే ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లు చాడగొండ కవిత, చొప్పరి జయశ్రీ తదితరులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ చిత్రా మిశ్రా, కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌తో పాటు అధికారులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
నగరంలో కుక్కలు, కోతుల బెడదను నివారించాలని డిమాండ్ చేస్తూ సమావేశానికి ముందే కాంగ్రెస్ కార్పొరేటర్లు నగరపాలక కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నగరంలో కోతులు, కుక్కల బెడద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నగరంలో అన్ని డివిజన్లలోనూ పారిశుధ్యం సరిగా సాగడం లేదని పాలకవర్గ సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. కార్మికులు, జవాన్లను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న పర్యావరణ ఇంజినీర్ స్వామిపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, చొప్పరి జయశ్రీ ప్రశ్నించారు. నగరంలోని చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతున్నదని తెలిపారు. నగరంలో వాణిజ్య చెత్త సేకరణ చేస్తున్న మహా సంస్థ ప్రతినిధులు వ్యాపారులు, అపార్ట్మెంట్ల నుంచి భారీగా యూజర్ చార్జీలు వసూళ్లు చేస్తున్నారని, దీనిని పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని కార్పొరేటర్ రవీందర్‌సింగ్ డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అనుమతులు ఇచ్చే విషయంలో అధికారులు భారీగా ముడుపులు వసూళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై చర్యలు చేపట్టాలని సభ్యులు కోరారు. అలాగే, ఆస్తి పన్నుల విధింపు విషయంలోనూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఈవిషయంలో చర్యలు చేపట్టాలన్నారు. ఒకే చోట ఉన్న ఇళ్లకు ఒక్కొక్కరికి ఒక్కొ తీరులో పన్నులు వస్తున్నాయని, ఇటీవల పన్నులు భారీగా పెంచారని వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పాలకవర్గ సభ్యులు తెలిపారు.
నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశానికి ఎప్పుడూ లేని విధంగా పోలీసుల భారీ బందోబస్తు కొనసాగింది. సాధారణ సర్వసభ్య సమావేశాలకు గతంలో ఎప్పుడు కూడా ఇలా పోలీసులు మోహరింపు కనిపించలేదని, అధికార పక్షం మారగానే ఈ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏమిటన్న గుసగుసలు వినిపించాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు ప్రతి ఏటా కూడ పెద్ద సంఖ్యలోనే ఆస్తి పన్నులు చెల్లించేందుకు కార్యాలయానికి ప్రజలు వస్తుంటారు. అయితే ఈ సారి ఉదయం 12.30 గంటల వరకు భారీ పోలీసులు బందోబస్తుతో పన్నులు చెల్లించేందుకు వచ్చిన ప్రజలు సైతం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బల్దియాలో అడుగడుగున పోలీసులు అన్నట్లుగా కనిపించింది.