సిరిసిల్ల సిగలో మరో మణిహారం చేరుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లెల్ల శివారులో ఆధునిక వ్యవసాయ కళాశాల నిర్మితమైంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అత్యాధునిక హంగులు.. సకల వసతులతో రూపుదిద్దుకున్నది. 69.30 కోట్ల వ్యయంతో 16 ఎకరాల్లో కళాశాల భవనం, బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు, మరో 19ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఫాంలాండ్ను సర్కారు నిర్మించింది. అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్లు, ప్రయోగశాల, సెమినార్ రూములు, అధ్యాపకుల గదులు, అసోసియేట్ డీన్ చాంబర్, ఆధునిక లైబ్రరీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఇది రెండోది కాగా, త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సిరిసిల్ల రూరల్, జూన్ 22: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవచూపి కార్మిక క్షేత్రమైన సిరిసిల్లకు వ్యవసాయ విద్యను తీసుకువచ్చారు. 2014లో రాష్ట్ర ఏర్పాటుతోనే సిరిసిల్లకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించారు. తర్వాత 2017లో వ్యవసాయ కాలేజీని మంజూరు చేయించగా, 2018లో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా తాత్కాలికంగా అప్పటి సర్దాపూర్లోని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో తరగతులు ప్రారంభించారు. ఈ క్రమంలో తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో సిరిసిల్ల-సిద్దిపేట రహదారిని ఆనుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 69.30 కోట్లతో కళాశాల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లోని యూనివర్సిటీలా రాష్ట్రంలో రెండోదిగా కళాశాలను తీర్చిదిద్దారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సకల వసతులు.. ఆధునిక సదుపాయాలు
వ్యవసాయ కళాశాలను 35 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. అందులో 16 ఎకరాల్లో కళాశాల భవనాలను జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మించారు. బాలబాలికలకు వేర్వేరుగా రెండేసి బ్లాక్లను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో చూడగానే ఆకర్షించేలా పచ్చదనం ఉట్టి పడేలా గ్రీనరీ ఏర్పాటు చేశారు. అత్యాధునిక వసతులు, కంప్యూటర్ ల్యాబ్లు, ప్రయోగశాల, గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్, అంతర్గత రోడ్లు, సెమినార్ రూంలు, లెక్చరర్స్ గదులు, అసోసియేట్ డీన్ చాంబర్, అడ్మినిస్ట్రేటివ్, కళాశాల తరగతి గదులు, లైబ్రరీ, ఆడిటోరియం, ఓపెన్ థియేటర్, భూసార పరీక్షల ప్రయోగశాలలు గదులను ఏర్పాటు చేశారు. ఆడిటోరియం, సెమినార్ హాళ్లను 400 మంది కూర్చునేలా విశాలంగా నిర్మించారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ పరిశోధనల కోసం 19 ఎకరాల్లో ఫాంలాండ్స్, అందులో ఒక ఎకరంలో నీటి కుంటను ఏర్పాటు చేశారు. కళాశాలలో చినుకు పడితే ఆ నీరంతా కుంటలో చేరేలా డ్రైనేజీలు, సీసీ రోడ్లను నిర్మించారు.
2018నుంచే తరగతులు..
వ్యవసాయ కళాశాల తరగతులను 2018 నుంచి తాత్కాలికంగా సర్దాపూర్లోని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సెకండ్, థర్డ్ ఇయర్ క్లాసులు కొనసాగుతున్నాయి. ఫస్టియర్ విద్యార్థులకు హైదరాబాద్ కళాశాలలో, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు జగిత్యాల కళాశాలలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెకండియర్లో 69 మంది, థర్డ్ ఇయర్లో 60 మంది విద్యను అభ్యసిస్తున్నారు.
అన్ని వసతులు కల్పించారు..
వ్యవసాయ కళాశాలను 35 ఎకరాల్లో నిర్మించడం సంతోషంగా ఉంది. విద్యార్థులు చాలా అదృష్ట వంతులు. ఇతర ప్రాంతాలకు పరిశోధనలకు వెళ్లకుండా అన్ని వసతులు కల్పించారు. కళాశాల ప్రారంభిస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. రైతులకు వ్యవసాయ, వాతావరణ వివరాలతోపాటు ఇతరత్రా సమాచారం, క్షేత్ర స్థాయి పరిశోధనలు అందుబాటులోకి వస్తాయి. కళాశాల ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, యూనివర్సిటీ ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– డాక్టర్ ఉమామహేశ్వరి, అసోసియేట్ డీన్ (సిరిసిల్ల వ్యవసాయ కళాశాల)
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం..
మాది వరంగల్. ఫస్టియర్ నుంచి ఇక్కడే చదువుతున్నా. నూతన కళాశాల భవనాన్ని ఇటీవలే సందర్శించాం. విశాలంగా ఉంది. వాతావరణం చాలా బాగుంది. అన్ని వసతులను ఏర్పాటు చేశారు. చుట్టూ వ్యవసాయ పొలాలు ఉన్నాయి. కళాశాలలోనే కావాల్సిన వసతులు కల్పించారు. ప్రారంభోత్సవం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం.
– నవ్య, థర్డ్ ఇయర్ (సిరిసిల్ల వ్యవసాయ కళాశాల)
అద్భుతంగా ఉంది..
కళాశాల చాలా అద్భుతంగా ఉంది. హైదరాబాద్లో రాజేంద్రనగర్లో యూనివర్సిటీలో ఉన్న వసతులన్నీ సిరిసిల్ల కళాశాలలో ఏర్పాటు చేశారు. సుందరంగా నిర్మించారు. ఆధునిక వసతులు, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరి యాలు, ప్రయోగ శాల, హాస్టల్స్, అంతర్గత రోడ్లు ఏర్పాటు చేశారు. కొత్త కాలేజీలోకి ఎప్పుడెప్పుడు పోతామా అని ఉంది.
– చిరంజీవి, థర్డ్ ఇయర్ (సిరిసిల్ల వ్యవసాయ కళాశాల)
జిల్లాకే తలమానికం..
సిరిసిల్ల వ్యవసాయ కళాశాల జిల్లాకే తలమానికం. సకల హంగులతో కళాశాలను ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. కళాశాలతో వ్యవసాయ విద్యతోపాటు రైతులకు మేలు జరుగుతుంది. రైతులకు ఆధునిక, సేంద్రియవ్యవసాయంతోపాటు ఇతర సహాయ సహకారాలు నేరుగా అందుతాయి. కళాశాల ఏర్పాటుకు సహకరించిన గ్రామస్తులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
– మాట్ల మధు, జిల్లెల్ల సర్పంచ్ (సర్పంచ్ల ఫోరం సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు)