ఎంపీ దీవకొండ దామోదర్‌రావు స్వగ్రామమైన మద్దునూర్ ప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. దామోదర్‌రావు విజ్ఞప్తితో బుధవారం జగిత్యాల కలెక్టర్ రవికి ఫోన్ చేశారు. గ్రామఅభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, చేపట్టాల్సిన పనులను గుర్తించాలని ఆదేశించగా, కలెక్టర్ గ్రామంలో 3గంటలకుపైగా పర్యటించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించడంతోపాటు గ్రామస్తులతో సమావేశమై చేపట్టాల్సిన పనుల గురించి తెలుసుకున్నారు. నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు.
ధర్మపురి, జూన్ 22: ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు స్వగ్రామమే మద్దునూర్. ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలంలో ఉంటుంది. మారుమూలన ఉన్న సొంతూరును మోడల్‌గా తీర్చిదిద్దాలనేది ఆయన కల. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన సందర్భంలో దామోదర్‌రావు మద్దునూర్ ప్రగతిపై ప్రస్తావించారు. స్పందించిన సీఎం వెంటనే మద్దునూర్ ప్రగతిపై ఆరా తీశారు. మొదట మంత్రి ఈశ్వర్‌తో ఫోన్లో మాట్లాడారు. అధికార బృందాన్ని గ్రామానికి పంపి నివేదిక పంపాలని ఆదేశించారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కలెక్టర్ జీ రవికి ఫోన్ చేసి అదే విషయం చెప్పారు. గ్రామాన్ని సందర్శించి పనుల ప్రగతిని పరిశీలించాలని, చేపట్టాల్సిన పనులను గుర్తించాలని ఆదేశించారు. దీంతో అధికార బృందంతో కలిసి గ్రామంలో దాదాపు మూడు గంటలపాటు పర్యటించారు.
గుర్తించిన పనులు ఇవే..
గ్రామం మొత్తంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు చేపట్టాల్సిన పనులను కలెక్టర్, అధికారులు గుర్తించారు. ప్రధానంగా శిథిలావస్థలో ఉన్న హైస్కూల్ బిల్డింగ్ స్థానంలో నూతన తరగతి గదుల నిర్మాణం, గ్రామంలో 3.5 కిలోమీటర్ల సీసీ రహదారి, 1.5 కిలోమీటర్ల డ్రైనేజీ, 1.5 కిలోమీటర్ల డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్, మద్దునూర్ నుంచి గోపులాపూర్, మద్దునూర్ నుంచి బీర్సాని లింక్ రోడ్లు, గోదావరి నుంచి మద్దునూర్ దాకా ఎత్తిపోతల పథకం, తుమ్మల చెరువు, ఊర చెరువు మత్తడి వద్ద మినీ బ్రిడ్జిల నిర్మాణం, ప్రజారోగ్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం, రెండు అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు, బస్సు సౌకర్యం గురించి ప్రజలు కలెక్టర్‌కు విన్నవించారు.
3గంటలకుపైగా గ్రామంలోనే కలెక్టర్..
సీఎం కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ రవి రంగంలోకి దిగారు. అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మాధురి, పంచాయతీ అధికారి హరికిషన్, ఇతర శాఖల జిల్లా అధికారులతో కలిసి బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత మద్దనూర్కు చేరుకున్నారు. సాయంత్రం 4గంటల వరకు గ్రామంలోనే ఉన్నారు. దాదాపు 3 గంటలకుపైగా అక్కడే గడిపి, గ్రామమంతా కాలినడకన తిరిగారు. వీధివీధినా పర్యటించి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకున్నారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాదినేని రాజమణి, జడ్పీటీసీ రాజేందర్, సర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ మహేశ్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
నివేదిక పంపిస్తాం ..
మద్దునూర్‌కు చెందిన దీవకొండ దామోదర్‌రావు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం గ్రామస్తుల అదృష్టం. ఆయన విజ్ఞాపన మేరకు మద్దునూర్ అభివృద్ధికి నివేదిక తయారు చేసి పంపాలని సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ ఆదేశించారు. ఆ మేరకు అధికారుల బృందంతో కలిసి గ్రామంలో మూడు గంటలకుపైగా పర్యటించాం. గ్రామసభ నిర్వహించి గ్రామస్తుల నుంచి విన్నపాలు స్వీకరించాం. సమస్యలు తెలుసుకున్నాం. చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించాం. నివేదిక తయారు చేసి గురువారం ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిస్తాం. మంత్రి నిధులతోపాటు కలెక్టర్ ఫండ్ నుంచి కేటాయించిన నిధులతో గ్రామాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తాం. గ్రామస్తులంతా సహకరించాలి.
– జగిత్యాల కలెక్టర్ రవి