జ్యోతినగర్, జూన్ 22: మానవ హక్కులపై విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ ఈడీసీ మిలినీయం హాల్లో బుధవారం మానవహక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. జిల్లాలో ఏడు మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అందిస్తున్న సేవలు, పథకాల అమలుతీరు, విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు.
చైల్డ్హోంల వివరాలు, ఆసరా పింఛన్లపై ఆరా తీశారు. సాగు తీరు, పల్లెప్రగతి తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాల పెంపుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎక్కడైనా మానవహక్కుల ఉల్లంఘన జరిగితే కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత పౌరులపై ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనల్లో కమిషన్కు సుమోటోగా కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు చేసే అధికారం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ సంగీతా సర్వేసత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ అఖిల్ మహాజన్, సింగరేణి స్పెషల్ డీప్యూటీ కలెక్టర్ నరసింహామూర్తి ఉన్నారు.