తెలంగాణచౌక్, జూన్ 22: ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతాయని పీఆర్టీయూ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని ప్రెస్ భవనంలో రాష్ట్ర జిల్లా నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు సంబంధించిన మేనేజ్ మెంట్ వారీగా సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్‌గా, స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని తెలిపారు.
కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలు రూపొందించే క్రమంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. త్వరలోనే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అవుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. పీటీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం ఒకటో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించిందన్నారు. న్యాయవివాదాలకు తావు లేకుండా ఉపాధ్యాయుల పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లెపాణి వేణుగోపాల్‌రావు, రాష్ట్ర సహాధ్యక్షుడు పాతూరి రాజ్‌రెడ్డి, చొల్లేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.