కార్పొరేషన్, జూన్ 22: నగరంలోని శివారు డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. స్థానిక ఒకటో డివిజన్లోని తీగలగుట్టపల్లిలో రూ. 31 లక్షలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, శివారు డివిజన్లను నగరంతోపాటు సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఎల్ఈడీ బల్బులు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు అపోలో దవాఖాన వద్ద రూ.80 లక్షలతో డ్రైనేజీ పనులు కూడా పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. జూలై చివరిలోగా నగరంలోని అన్ని ప్రాంతాలకు రోజూ నీటి సరఫరా చేస్తామన్నారు.
ఇందుకోసం అన్ని డివిజన్లలో మంచినీటి పైపులైన్లు వేస్తున్నట్లు తెలిపారు. ఆరెపల్లి, తీగలగుట్టపల్లి డివిజన్లకు వారంలోగా రోజూ నీటి సరఫరా చేస్తామన్నారు. మిగతా శివారు డివిజన్లలో పైప్‌లైన్ పనులు పూర్తయిన వెంటనే రోజూ నీటి సరఫరా చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి టెండర్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 30న మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భావితరానికి అనుగుణంగా కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం 30, 40, 50 ఫీట్లు రోడ్లను విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పాలకవర్గం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు.
హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి
కరీంనగర్‌ను హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ పేర్కొన్నారు. ఒకటో డివిజన్లో హరితహారంలో భాగంగా ఆయన మొకలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతామని తెలిపారు. ఇప్పటికే పట్టణ ప్రకృతి వనాలు, పెద్ద ఎత్తున నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. డివిజన్ల వారీగా స్థలాలను గుర్తించి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో కార్పొరేటర్ కోలగాని శ్రీనివాస్, ఈఈ కిష్టప్ప, డీఈ మసూద్ అలీ, ఏఈ గట్టు స్వామి, మున్సిపల్ సిబ్బంది, డివిజన్ ప్రజలు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.