వానకాలం పంటల సాగుకు సమయం ఆసన్నమైంది.. మరికొద్ది రోజుల్లో వర్షాలు పుంజుకొనే అవకాశం ఉండడంతో ఏరువాక జోరందుకోనున్నది.. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సెంటర్ లాభదాయక పంటలపై పరిశోధనలు చేపట్టింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ సరళి, ప్రజల డిమాండ్‌ను విశ్లేషించింది. ఈ సీజన్లో వరి, మక్క, పసుపు అంతగా గిట్టుబాటు కాదని, పత్తి, సోయాచిక్కుడు, కందిలాంటి పంటలు వేస్తే దండిగా దిగుబడి సాధించవచ్చని చెప్పింది. రైతాంగం మూస పద్ధతులను వీడాలని, ఆధునిక విధానాలను పాటించినప్పుడే ఆశించిన ఫలితాలు ఉంటాయని నిర్దేశించింది.
కరీంనగర్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : ఇప్పుడిప్పుడే వానలు కురుస్తుండడంతో అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువుల సేకరణలో నిమగ్నమయ్యారు. అయితే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు విస్త్రృతంగా పరిశోధనలు చేసిన మీదట అన్నదాతలకు పలు సూచనలు చేశారు. మూసధోరణిలో వరి, మక్క, పసుపు వంటి సాంప్రదాయ పంటలకు బదులుగా పత్తి, కంది, సోయా లాంటి పంటలు వేయాలని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు, నేలల సారానికి అనుగుణంగా సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. గుడ్డిగా మార్కెట్లో దొరికే విత్తనాలు వేయకుండా నాణ్యమైనవి ఎంచుకోవాలని కోరుతున్నారు.
వరి సాగు
వరిలో సన్న రకాలు : 150 రోజుల పంట కాలం సాంబమసూరి (బీపీటీ 5204) సిద్ధి (డీబ్ల్యూజీఎల్ 44)
మధ్యకాలిక రకాలు : 135 రోజుల పంట కాలం. డబ్ల్యూజీఎల్ 32100 (వరంగల్ సన్నాలు), డబ్ల్యూజీఎల్-14 (వరంగల్ సాంబ), డబ్ల్యూజీఎల్ 347 (సొమ్నాథ్), జేజీఎల్ 11470 (జగిత్యాల మసూరి), జేజీఎల్ 3828 (మానేరు సోన), జేజీఎల్ 11727 (ప్రాణహిత), ఆర్ఎన్ఆర్ 2458(కృష్ణ), జేజీఎల్ 384 (పొలాస ప్రభ).
స్వల్ప కాలిక సన్న గింజ రకాలు : ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోన), కేఎన్ఎం 733, కేఎన్ఎం 1638 (కూనారం వరి-2), డబ్ల్యూజీఎల్ 962 (కూనారం రైస్-1), రైతులు సన్న గింజ రకాలను ఎంచుకుంటే మంచిది. దీంతో జూలైలో నారు పోసుకునేందుకు సమయం ఉంటుంది. అంటే సమయం కలిసి వస్తుంది. అలాగే, పచ్చి రొట్ట ఎరువులు వేసుకునే అవకాశం ఉంటుంది. నీటి వినియోగం తగ్గుతుంది.
దొడ్డు రకాలు : మధ్య కాలిక రకాల్లో ఎంటీయూ 1001, స్వల్ప కాలిక రకాల్లో జేజీఎల్ 18047 (బతుకమ్మ), కేఎన్ఎం 118 (కూనారం సన్నాలు), ఎంటీయూ 1010, జేజీఎల్ 24423 వేసుకుంటే మంచిది.
కందిలో ఈ విత్తనాలు మేలు
tకంది పంట సాగు చేసే రైతులు మధ్య కాలిక రకాలు (160-180 రోజుల పంట కాలం) అధిక వర్ష పాతం కలిగిన నల్ల రేగడి నేలల్లో 1-2 అడుగులు ఇవ్వగలిగినపుడు ఈ రకాలను ఎంచుకోవాలి. డబ్ల్యూఆర్‌జీ-65, ఐసీపీఎల్ 87119(ఆర్), ఐసీపీ 8863, డబ్ల్యూఆర్‌జీ-255, టీడీఆర్జీ-4 టీడీఆర్జీ-59 రకాలను ఎంచుకోవాలి. తక్కువ కాల పరిమితి గల రకాలు (140-160 రోజుల పంట కాలం) తక్కువ వర్ష పాతం కలిగి మధ్యస్థ తేలిక నేలల్లో పూత సమయంలో బెట్ట పరిస్థితులను అధిగమించేందుకు ఈ రకాలు అనుకూలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ కాలంలో పీఆర్జీ 158, పీఆర్జీ 176, డబ్ల్యూఆర్‌జీ-97 అనువైనవిగా చెబుతున్నారు.
కందిలో ఎండు తెగులు తట్టుకునే రకాలు : ఐసీపీఎల్ 87119, ఐసీపీ 8863, డబ్ల్యూఆర్‌జీ 97, డబ్ల్యూఆర్‌జీ 93, టీడీఆర్జీ 4, టీడీఆర్జీ 59, రకాలు అలాగే సెటరిలిటీ మొజాయిక్ తెగులును తట్టుకునే సీపీఎల్ 87119, టీడీఆర్జీ 59, ఎండు తెగులు సమస్యాత్మక ప్రాంతాల్లో విధిగా ట్రైకో డెర్మా విరిడే 8-10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
‘వెద’ పద్ధతి మేలు..
ప్రస్తుత పరిస్థితుల్లో వరిసాగు చేసే రైతులు కూలీల కొరత, పెట్టుబడి ఖర్చులు, నీటి కొరత వల్ల సకాలంలో నాట్లు వేయలేక పోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నారుమడి లేకుండా నేరుగా విత్తనాలు వెదజల్లే పద్ధ్దతిలో లేదా డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా విత్తుకొనే పద్ధతిలో సాగు చేసుకుంటే కలిసి వస్తుంది. దిగుబడి కూడా అధికంగా వస్తుంది.
పత్తిలో వెరైటీలు
పత్తిలో అనేక ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు బోల్ గార్డ్ 1, 2 మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన గులాబీ రంగు పురుగు వల్ల డిసెంబర్‌లోగా పత్తిని తీసేసి రెండో పంటగా మక్క, నువ్వులు, పెసర, పల్లి, శనగ లాంటి పంటలను వేసుకునే విధంగా రైతులు సిద్ధమైతే మంచిది. తేలికపాటి నేలల్లో వర్షధారంగా పండించే భూముల్లో పత్తిని సాధారణ పద్ధతిలో కంటే అధిక సాంద్రతలో సాగు చేయడం మంచిది.
డిమాండ్ ఉన్న పంటలు వేయాలి
రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు ఎంచుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ సీజన్లో వరి, మక్కజొన్న, పసుపు పంటలకు డిమాండ్ ఉండక పోవచ్చు. వీటికి బదులు పత్తి, సోయాబీన్, కంది, పెసర, మినుము వంటి పంటలు వేసుకుంటే మంచిది. రైతులు వరితోపాటు ఇతర పంటలను కూడా సాగు చేసుకోవాలి. తప్పనిసరిగా వేసుకుంటే మంచి విత్తనాలను ఎంచుకోవాలి. సాగుకు ముందు తప్పనిసరిగా పచ్చి రొట్ట వేసుకోవాలి. దీని వల్ల రసాయన ఎరువుల సామర్థ్యం పెరుగుతుంది. అధిక దిగుబడులు కూడా వస్తాయి.
– డాక్టర్ జీ మంజులత, ప్రధాన శాస్త్ర వేత్త, హెడ్ వ్యవసాయ పరిశోధన స్థానం (కరీంనగర్ )
పెసరలో ఎలాంటి రకాలు
పెసరలో నాణ్యమైన రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. డబ్ల్యూజీజీ 2, డబ్ల్యూజీజీ 37, డబ్ల్యూజీజీ 42, ఎంజీజీ 295 ఎంజీజీ 347, ఎంజీజీ 348, ఎంజీజీ 351 రకాలను ఎంచుకుంటే మంచిదని శాస్త్ర వేత్తలు సూచిస్తున్నారు.