పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు పేర్కొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయా గ్రామాల్లో చేపట్టిన పారిశుధ్య పనులను వారు పరిశీలించారు. వానకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
మానకొండూర్ మండలంలో..
మానకొండూర్ రూరల్, జూన్ 14: ముంజంపల్లిలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను యూనిసెఫ్ ప్రాజెక్టు సమన్వయ కర్త కిషన్ స్వామి సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు. చెత్త, మురుగు నీటి నిర్వహణ, మరుగుదొడ్ల వినియోగం అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా, గ్రామంలో డాక్టర్ వినత, డాక్టర్ అనూష ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన ర్యాలీ నిర్వహించారు. దాదాపు 250 మందికి బీపీ, షుగర్, థైరాయిడ్, టీబీ, నేత్ర సంబంధ పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అరవింద్ రెడ్డి, డాక్టర్ సుస్మితా రెడ్డి, ప్రత్యేకాధికారి జ్యోతి, పంచాయతీ కార్యదర్శి శ్రావణి, యూనిసెఫ్ ప్రాజెక్టు క్లస్టర్ ఫెసిలిటేటర్ కళ్యాణి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మానకొండూర్లో..
మానకొండూర్, జూన్ 14: పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మానకొండూర్లో వైద్యసిబ్బంది ర్యాలీ చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సర్వే చేశారు. జ్వరం, వివిధ ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు. గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ కార్మికులు పారిశుధ్య పనులు చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారి మమత, పంచాయతీ కార్యదర్శి వంగల శ్రీనివాస్, గ్రామపంచాయతీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
శంకరపట్నం మండలంలో..
శంకరపట్నం, జూన్ 14: మండలంలోని గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా పారిశుధ్య పనులు నిర్వహించారు. వర్షాకాలంలో ప్రబలే మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో మురుగు నీటి గుంతల్లో ఆయిల్ బాల్స్ వేశారు. కొత్తగట్టు గ్రామంలో మొక్కలు నాటించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఎన్ అంజనీ, ఎంపీడీవో జయశ్రీ, ఎంపీవో బషీర్, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడి, జూన్ 14: పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం పారిశుధ్య పనులు కొనసాగాయి. దోమల నివారణ చర్యలు చేపట్టారు. ఆయా పనులను ప్రత్యేకాధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. తడి, పొడి చెత్తపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చిగురుమామిడిలో పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, మండల వైద్యాధికారి నాగశేఖర్, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్ పాల్గొన్నారు. రామంచ, సుందరగిరి, లంబాడిపల్లి, గునుకులపల్లె, ముదిమాణిక్యం గ్రామాల్లో పనులను ఎంపీవో శ్రావణ్ కుమార్ పరిశీలించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
జంగపెల్లిలో..
గన్నేరువరం, జూన్ 14: మండలంలోని జంగపెల్లిలో పల్లె ప్రగతిలో భాగంగా సర్పంచ్ అటికం శారదాశ్రీనివాస్ ఆధ్వర్యంలో హెల్త్ డే కార్యక్రమం నిర్వహించారు. వైద్య సిబ్బంది వాడవాడన తిరుగుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారి రవళి, పంచాయతీ కార్యదర్శి లచ్చయ్య, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆశ కార్యకర్తలు శ్యామల, లావణ్య, అంగన్వాడీలు జే సరోజన, ఎం రజిత, వీవోలు అంజలి, సువర్ణ, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.