పల్లె ప్రగతి కార్యక్రమం మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఎనిమిదో రోజు శనివారం పవర్డేలో భాగంగా విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టగా, ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు పరిశీలించారు. అలాగే హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ చర్యలతో పాటు పారిశుధ్య పనులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
మానకొండూర్‌లో..
మానకొండూర్, జూన్ 11: పల్లెప్రగతి ఐదో విడుత కార్యక్రమంలో శనివారం మానకొండూర్‌లో పారిశుధ్య పనులు చేపట్టారు. గ్రామంలో చేపట్టాల్సిన విద్యుత్ మరమ్మతు పనులను సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్ విద్యుత్‌శాఖ సిబ్బందితో కలిసి గుర్తించారు. ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేకాధికారి మమత, పంచాయతీ కార్యదర్శి వంగల శ్రీనివాస్, విద్యుత్‌శాఖ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మానకొండూర్ మండలంలో..
మండలంలోని ఖాదరగూడెంలో శనివారం డీపీవో వీర బుచ్చయ్య పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించి, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణం కోసం ఎంపీడీవో దివ్యదర్శన్ రావుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. క్రీడా ప్రాంగణాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అలాగే మండలంలోని మిగతా గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయవేని రాజు, ఎంపీవో రాజేశ్వర్ రావు, పంచాయతీ కార్యదర్శి రమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.
శంకరపట్నం మండలంలో..
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని పలు గ్రామాల్లో వివిధ పనులు నిర్వహించారు. ఆముదాలపల్లి గ్రామంలో రోడ్లు శుభ్రం చేశారు. గద్దపాక వన నర్సరీలో మొక్కలు రిప్లేస్ చేశారు. ఎన్పీడీసీఎల్ సిబ్బంది విద్యుత్ మరమ్మతులు నిర్వహించారు. వైకుంఠధామంలో విద్యుత్ మీటర్ అమర్చారు. కన్నాపూర్, అర్కండ్ల, మెట్పల్లి తదితర గ్రామాల్లో లూజ్ వైర్లు సరి చేశారు. పలు గ్రామాలలో థర్డ్ వైర్లను లాగారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద చెట్ల పొదలను తొలగించారు. గద్దపాకలో పనులను మండల ప్రత్యేకాధికారి ఎన్ అంజనీ పరిశీలించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అక్కడక్కడ నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయశ్రీ, ఎంపీవో ఎండీ బషీర్, సర్పంచులు, ఎంపీటీసీలు, తాడికల్, ఆముదాలపల్లి సబ్ స్టేషన్ల ఏఈఈలు బీ శ్రీనివాస్, కుమారస్వామి, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చిగురుమామిడి మండలంలో..
పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం పారిశుధ్య పనులు చేశారు. గాగిరెడ్డిపల్లిలో ఎంపీడీవో నర్సయ్య, సర్పంచ్ సన్నీళ్ల వెంకటేశం క్రీడా ప్రాంగణానికి భూమి పూజ నిర్వహించారు. ఇందుర్తి, ముదిమాణిక్యం, ములనూర్ గ్రామాల్లో ఎంపీవో శ్రావణ్‌కుమార్ పారిశుధ్య పనులను పరిశీలించారు. ఉల్లంపల్లి వైకుంఠధామం వద్ద బోర్ వేయగా, మండల ప్రత్యేకాధికారి నతానియెల్ సర్పంచ్ చెప్యాల మమతతో కలిసి పరిశీలించారు. బొమ్మనపల్లి, రేకొండ, కొండాపూర్, సుందరగిరి, ముదిమాణిక్యం తదితర గ్రామాల సర్పంచులు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో కలిసి పల్లె ప్రగతిలో పాల్గొన్నారు.