జగిత్యాల, (నమస్తే తెలంగాణ), జూన్ 2: తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు అంకురార్పణ చేసిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఇప్పటికే నిర్వహించిన కార్యక్రమాలతో అద్భుత ఫలితాలు వచ్చాయని చెప్పారు. కేంద్రం ప్రకటించిన 10 అవార్డులు తెలంగాణలోని పల్లెలకు దక్కడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ యేడు విరివిగా మొక్కలు నాటేందుకు హరిత ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్స్‌లో గురువారం ఐదో విడుత పల్లె ప్రగతి, నాలుగో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్షించారు. శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు ప్రారంభమయ్యే పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు. మండలానికి జిల్లాస్థాయి, గ్రామాలకు మండలస్థాయి అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
హరితహారం కింద నాటిన అవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొకలను పరిశీలించి, చనిపోయిన మొకల స్థానంలో కొత్తవి నాటాలని సూచించారు. ఈ కార్యక్రమాల అమల్లో అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన హరితహారం ఫలితంగా రాష్ట్రంలో 7 శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు. కలెక్టర్ జీ రవి మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి స్ఫూర్తి నిరంతరం కొనసాగే విధంగా అధికారులు పనిచేయాలని, పల్లె, పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని సూచించారు.
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించి పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని సూచించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద చేపట్టిన పనులను గడువులోగా పూర్తిచేయాలని చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి ఫలితంగా దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డులు లభించాయని, కొడిమ్యాల మండల ప్రజా పరిషత్‌కు అవార్డు లభించిందని గుర్తుచేశారు. జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ పరిధిలో హరితహారం కింద మొకలు నాటి సంరక్షించి రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచి అవార్డు అందుకోవడం గర్వకారణంగా ఉన్నదన్నారు. అనంతరం మంత్రి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ పై అధికారులు ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు. దళిత బంధు లబ్ధిదారులకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఇందులో అదనపు కలెక్టర్ లత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, జగిత్యాల ఆర్డీవో మాధురి, డీఆర్డీవో వినోద్ కుమార్, డీపీవో, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.