ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ముఖాల్లో చిరునవ్వులు చూసే లక్ష్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో కులమతాలకతీతంగా అభివృద్ధి జరుగుతున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కటకం శ్రీధర్‌ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన అనంతరం మంత్రి మాట్లాడారు. జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యావంతులు, మేధావులు దేశంలోని పరిస్థితులను అర్ధం చేసుకోవాలన్నారు. తెలంగాణ ఎనిమిదేండ్ల కాలంలో అనితర సాధ్యమైన విజయాలు సాధించిందన్నారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని, పల్లె ప్రకృతి వనాలు, డంప్‌యార్డులు, రైతు వేదికలు, ఇంటింటికీ నల్లానీరుతో సుసంపన్నంగా ఉన్నాయని, తెలంగాణలో గ్రామ స్వరాజ్యం కనిపిస్తున్నదన్నారు.
అభివృద్ధి విషయంలో రాజకీయాలు అవసరం లేదని, ప్రతిపక్ష పార్టీల నేతలు సర్పంచులు, ఎంపీటీసీలుగా ఉన్న పంచాయతీల్లోనూ పక్షపాతం లేకుండా నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. గంభీరావుపేటకు మున్సిపాలిటీకి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని, ప్రజలు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లోగా మున్సిపాలిటీగా చేస్తామని ప్రకటించారు. లింగన్నపేట-గంభీరావుపేట వంతెనపై ఇటీవల రవాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో మాట్లాడనని త్వరలో మంజూరవుతుందని అన్నారు. గంభీరావుపేటలో తప్పా జిల్లావ్యాప్తంగా రహదారుల విస్తరణ జరిగిందని చెప్పారు. ప్రజలను ఒప్పించి రహదారులను విస్తరణ చేపట్టాలని పాలకవర్గానికి సూచించారు.
విస్తరణలో నష్టపోయే పేదలకు సాయం చేస్తామని భరోసానిచ్చారు. గంభీరావుపేట మండల అభివృద్ధ్దికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు ఎప్పటికప్పుడు సమిష్టి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. శ్రీధర్ చేరికతో గంభీరావుపేటలో పార్టీ బలోపేతమవుతుందని చెప్పారు. శ్రీధర్ తండ్రి కటకం మృత్యుంజయం సీనియర్ నాయకులని ఆయనంటే గౌరవమని అన్నారు. ఈ సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, మండలాధ్యక్షుడు పాపగారి వెంకటస్వామిగౌడ్, మాజీ మండలాధ్యక్షుడు కమ్మరి రాజారాం, మండల నాయకులు, తదితరులు న్నారు.