కార్పొరేషన్, జూన్ 1: నగరాలు, పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు చేపట్టిన పట్టణ ప్రగతిని ఈ నెల 3 నుంచి ప్రారం భించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 15 రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. నగరాలు, పట్టణాలను స్వచ్ఛతలో ముందుంచేందుకు ప్రజలను భాగస్వాములను చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే అన్ని పట్టణాల్లో వార్డుల వారీగా ప్రత్యేకాధికారులను నియమించారు. వీరు ప్రతి రోజు పర్యటించి పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు ఇతర సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తారు. కార్యక్రమంలో భాగంగా యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లు, ఇతర ప్రముఖ వ్యక్తులు 15 మందితో వార్డు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. గతంలో చేపట్టిన పట్టణ ప్రగతి పురోగతిని వార్డు సభ్యులకు వివరిస్తారు.
ప్రతిరోజూ రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చే యడం, ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడీ కేంద్రాలను క్లీన్‌గా ఉంచేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇంకా బహిరంగ ప్రదేశాల్లో మొకలు నాటుతారు. ఒకరోజును పవర్ డేగా ప్రకటించి అన్ని పెండింగ్ పవర్ సమస్యలను పరిష్కరిస్తారు. ఒకరోజు వార్డులోని అన్ని రహదారులను పరిశీలించి స మస్యలను గుర్తిస్తారు. అవెన్యూ ప్లాంటేషన్‌కు అ నువైన స్థలాలు గుర్తించి ట్రీ పారులను ఏర్పా టు చేస్తారు. ఇంకా మంచినీటి సరఫరా సమస్యలను పరిష్కరించాలి. పట్టణంలోని డంపింగ్ యార్డును సందర్శించి, తడి చెత్త నుంచి కంపోస్ట్ తయారు చేయడం, పొడి చెత్తను వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
మరుసటి వైకుంఠధామాలను సందర్శించి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తారు. కనీసం ఒక వైకుంఠరథం ఉండేలా చర్యలు తీసుకుంటారు. వీటి తో పాటుగా ప్రతి వార్డుల్లో క్రీడా మైదానం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభు త్వం సూచనలు చేయగా, దీనిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రతి డివిజన్లో అపరిష్కృ తంగా ఉన్న సమస్యలు గుర్తించి, వాటిని వార్డు కమిటీలో చర్చించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఒక ప్రణాళిక మేరకు విభాగాల వారీగా సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా డివిజన్లకు అధికారులను నియ మించనున్నారు. ఈ సారి కార్యక్రమంలో అన్ని వార్డుల్లోని ప్రజలను పెద్దసంఖ్యలో భాగస్వాములను చేసి పనులు చేపట్టే దిశగా అధికారులు దృష్టి సారిస్తున్నారు.