కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ) : రైతులు మార్కెటింగ్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండొద్దని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేసి లాభాలబాట పట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. రైతులు శాస్త్రసాంకేతిక రంగాలను వినియోగించుకొని ముందుకు సాగాలని, దేశానికి అవసరమైన పంటలు పండించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. సాగునీటి రాకతో తెలంగాణలోని గ్రామాల ముఖచిత్రం మారిపోయిందని, ప్రతి రంగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని చెప్పారు.
పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సోమవారం కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్ హాల్లో కరీంనగర్-సిరిసిల్ల, జగిత్యాలలోని విరూపాక్షి గార్డెన్స్‌లో జగిత్యాల-పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి వానకాలం పంటల సాగు సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చాక వ్యవసాయ రంగమే ముఖ్య భూమికగా సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రమించిందని గుర్తు చేశారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు, కాలువల నిర్మాణం, ఇలా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 3.75 లక్షల కోట్లు వెచ్చించిందని తెలిపారు.
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. సాగులో ఉ త్పాదకత పెరిగితేనే రైతులకు లాభదాయకం అవుతుందని, పెట్టుబడులు తగ్గించి ఉత్పాదకత పెం చుకోవాలని సూచించారు. ఇందుకు వ్యవసాయ శాస్త్ర వేత్తలు అందిస్తున్న సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత సాగునీరు రావడంతో గ్రామాల ముఖచిత్రం మారిపోయిందని చెప్పారు. సోమవారం కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్ హాల్లో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల, జగిత్యాలలోని విరూపాక్షి గార్డెన్స్‌లో జగిత్యాల-పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి వానకాలం పంటల సాగుపై నిర్వహించిన వేర్వేరు వర్క్‌షాపులలో మరో ఇద్దరు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగు ల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి మం త్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టులు, పంటలు, గ్రామాలు, ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేని వాళ్లు రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు మోపుతున్నారని, రివర్స్ పంపింగ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సకాలంలో నిర్మించిన ఘ నత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్ర భుత్వ మంచి పనులను ప్రశంసించే గొప్ప మనసు విపక్షాలకు లేదని మండిపడ్డారు. సాగునీటి రాకతో వ్యవసాయమే కాకుండా భూగర్భజలాలు, పచ్చదనం, జీవజాలం పెరిగాయని తెలిపారు. అందరికీ అన్నం పెట్టేది, ఎకువ మందికి ఉపాధినిచ్చేది వ్యవసాయమేనని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాలో అధిక ధాన్యం ఉత్పత్తి
కరీంనగర్ అనేక పోరాటాలకు కేంద్రబిందువు అయిందని, నాడు పొరుగుదేశంతో యుద్ధం జరుగుతుండడం, నిజాం వేసిన కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కాకుండా ఏదైనా కోరుకోండని అప్పటి కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మూలంగానే కరీంనగర్‌కు లోయర్ మానేర్ డ్యాంతోపాటు కాకతీయ, హైదరాబాద్‌కు సెంట్రల్ యూనివర్సిటీలు వచ్చాయని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసిన జిల్లా కరీంనగర్ అని తెలిపారు. ఒక సాగునీటి ప్రాజెక్టుతో వ్యవసాయంలో వచ్చిన మార్పులను కరీంనగర్ ప్రజలు గతంలోనే చూశారని గుర్తు చేశారు.
పత్తి, నూనె, పప్పు గింజలకు డిమాండ్
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మారెట్లలో ఏ పంటల వినియోగం ఎకువ, ఏ పంట కొరత ఉంది, అనే విషయాలపై వ్యవసాయశాఖ అధ్యయనం చేసిందని, మారెట్లో పత్తితో పాటు నూనె, పప్పు గింజలకు డిమాండ్ ఉందని తెలిపారు. వానకాలం వరి సాగుపై ఆంక్షలు లేవని, అయితే రైతులు వరి కంటే లాభదాయకమైన పంటలు సాగుచేయాలని కోరారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని మేనిఫెస్టోలో చెప్పి మోదీ మోసం చేశారని విమర్శించారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తానని రైతులను దగా చేశారని, కేంద్రం రద్దుచేసిన వ్యవసాయ చట్టాలలో పంటలకు మద్దతు ధర ఊసులేదని, దానికోసమే 16 నెలలు ఢిల్లీలో రైతులు పోరాడి విజయం సాధించారని తెలిపారు.
నిజానికి ఈ నల్ల చట్టాలను 2019లో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలు చేర్చిందని, దానిని బీజేపీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈ చట్టాల రద్దు కోసం పోరాడి అసువులుబాసిన కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటే కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పంటలమార్పిడి చేయాలని, డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచిస్తే సమస్యపై అవగాహన లేని అపరిపక్వత ఉన్న వారు విమర్శిస్తారని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది 2.5 లక్షల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగుకు అన్నీ సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ చేసిన సాయాన్ని మించి సాయం చేసే మొనగాడు దేశంలో లేడని, ఎవరైనా ఉంటే చూపించాలని, తాము వాళ్లను అనుసరిస్తామని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కోతుల బెడదకు నివారణగా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు కమిటీని వేశామని తెలిపారు.
రైతు ప్రాధాన్యత భవిష్యత్ తరాలకు తెలియాలి
ప్రణాళిక ప్రకారం వ్యవసాయం చేస్తే ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా భారతదేశం అవతరిస్తుందని చెప్పారు. రాష్ట్రం రాక ముందు రైతు, సేద్యం రెండు చిన్నచూపునకు గురయ్యాయని, రైతు స్వాభిమానాన్ని కోల్పోయి ఒకింత ఈసడింపునకు గురైన పరిస్థితి ఉందేదని గుర్తు చేశారు. రాష్ట్రం కంటే నాలుగైదు రెట్ల అధిక విస్తీర్ణంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ వ్యవసాయం కోసం తెలంగాణ చేసిన ఖర్చులో చారాణ వంతు ఖర్చు చేయలేదన్నారు. తెలంగాణలో 35 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే, ఉత్తర ప్రదేశ్‌లో 6 లక్షల పంపుసెట్లకు మాత్రమే ఇస్తున్నారన్నారు.
యూపీలో అధిక శాతం డీజిల్ ఇంజిన్లపై వ్యవసాయం సాగుతుందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏం అభివృద్ధి జరుగుతుందో చెప్పకుండానే, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని విమర్శించడం విడ్డూరం గా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేర్పిన పా ఠాలు విని, తిరిగి తెలంగాణకే పాఠాలు చెప్పజూస్తున్నారని తెలిపారు. రైతు ప్రాధాన్యత, సేద్యరంగం గొప్పతనం భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని, లేకుంటే పిజ్జాలు, బర్గర్ లు ఎక్కడి నుంచి వస్తాయో సైతం తెలియని జనరేషన్లు వస్తాయన్నారు.
ఒకప్పుడు రెండు రూపాయలకు కిలోబియ్యం అని ఒక పార్టీ హామీ ఇస్తే, మూడు సార్లు ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన పరిస్థితి మనదని, అలాంటి తెలంగాణ నేడు దేశంలోనే అత్యధిక వరిని పండించే రాష్ట్రంగా సత్తాను చాటిచెప్పిందన్నారు. రైతులు పంట పెట్టుబడి తగ్గించి ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్క్‌షాప్‌లలో వ్వయసాయ శాఖ అదనపు కార్యదర్శి హన్మంత్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్లు కనుమల్ల విజయ, న్యాలకొండ అరుణ, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లు రవి నాయక్, సంగీత సత్యానారాయణ, అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యామ్ ప్రసాద్‌లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, కరీంనగర్ మేయర్ వై సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల రైతు బంధు సమితుల కో ఆర్డినేటర్లు తిరుపతి, నర్సయ్య, చీటి వెంకటర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనిత ఆంజనేయులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఆర్బీఎస్ మండ ల, గ్రామ కో ఆర్డినేటర్లు, డీఏవోలు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ వ్యవసాయం దశ, దిశను మార్చారు
రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు ఎనలేని గౌరవం ఉంది. ఒక రైతుగా సీఎం కేసీఆర్ వ్యవసాయం దశ, దిశను మార్చారు. ఆర్బీఎస్ ప్రతినిధులకు గౌరవ వేతనం అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. కరోనా విపత్తులోనూ రైతుబంధు, రైతు బీమా పథకాలను సీఎం కొనసాగించారు. 2014కు ముందూ తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను అందరూ గమనించాలి. రైతు బీమాను కాంగ్రెస్ వద్దంటోంది. 2014 నుంచి 2022 వరకు ఏటా గణనీయంగా రైతు ఆత్మహత్యలను తగ్గించుకుంటూ వస్తున్నాం. పంటలను చీడపీడల నుంచి రక్షించుకోవడంతో పాటు, రాజకీయ చీడల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతులు రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి పంటలు వేసుకోవాలో వ్యవసాయ అధికారులతో చర్చించాలి. డిమాండ్ ఉన్న పంటలు వేసి లాభాలు సాధించాలి.
– కరీంనగర్, జగిత్యాలలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
శాస్త్రీయంగా వ్యవసాయం చేయాలి
మనది వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలో 51శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉంది. ఒకప్పుడు 80 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు. నేడు 51 శాతానికి పడిపోయారు. పట్టణీకరణతో పల్లెల నుంచి వలసలు పెరిగి వ్యవసాయ కుటుంబాలు తగ్గిపోయాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా వ్యవసాయంపై దృష్టి సారించారో రైతులందరికీ తెలుసు. రాష్ట్ర వ్యవసాయరంగంలో సమూల మార్పులు వస్తున్నాయి.
పుష్కలమైన నీరు, 24 గంటల కరెంటుతో పంటలు పుష్కలంగా పండాయి. మిగతా రాష్ట్రాలను అధిగమించి తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నది. ఇంకా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉత్పత్తి పెరిగేలా శాస్త్రీయ వ్యవసాయం చేయాలి. అమెరికా, రష్యా వంటి దేశాలతోపాటు ప్రపంచంలోని వంద దేశాల్లో వ్యవసాయం చేయరు. వారికి ఆహారం అంతా బయటి దేశాల నుంచి రావాల్సిందే. కానీ, ఎగుమతుల్లో మన దేశం 16వ స్థానంలో ఉండడం దురదృష్టకరం. ఈ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
– కరీంనగర్, జగిత్యాలలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్
నవీన సేద్యంవైపు మళ్లించాలి
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. రైతు సంక్షేమం 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటివి అమలు చేస్తున్నది. కానీ, ప్రతిపక్షాలు తప్పు పట్టడం మూర్ఖత్వం. రైతు బంధు సమితులు రైతులను నవీన సేద్యం వైపు నడిపించాలి. రైతులు కూరగాయలతోపాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై దృష్టిపెట్టాలి. వరి అనేది సులువైన పంటగా పండిస్తున్నారు. ఇది సరికాదు. వరి కొనుగోలు అంశం రైతులందరి సమస్య. ఇది ఒక్క కేసీఆర్ సమస్య అనుకుంటే మూర్ఖత్వమే. వడ్ల కొనుగోలుకు కేంద్రం మొండిచేయి చూపినా సీఎం కేసీఆర్ రైతుల కోసం కొనుగోలు చేస్తున్నారు. రైతులంతా గమనించాలి.
– జగిత్యాలలో రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
లాభదాయక పంటలపై దృష్టి పెట్టాలి
ప్రపంచంలో అనేక దేశాలతో పాటు మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో భూములు సాగుకు యోగ్యంగా ఉండవు. కానీ, మన రాష్ట్ర భూములు సాగుకు యోగ్యమైనవే కాకుండా సారవంతమైనవి. పట్టణీకరణతో వ్యవసాయం వాణిజ్యంగా మారింది. రైతుకు వ్యవసాయం లాభసాటి కావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంటలే పండించాలి. ఏటా రూ.80 వేల కోట్ల నుండి రూ.90 వేల కోట్ల వంట నూనెలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వరి సాగు నుంచి రైతులు లాభదాయక పంటలను పండించడంపై దృష్టిసారించాలి. యాసంగి వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా సీఎం కేసీఆర్ ఆదేశాలతో రూ.4 వేల కోట్లు అదనంగా వెచ్చించి కొనుగోళ్లు జరుపుతున్నాం. ఇప్పటికే 37 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశాం.
– కరీంనగర్లో రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కాలానికనుగుణంగా మారాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు మా రాలి. అలాంటప్పు డే బాగుపడతారు. ఆకుపచ్చ చంద్రులై న రైతన్నలను కా పాడుకునేందుకే సీఎం కేసీఆర్ ఆరాటపడుతున్నారు. రైతు బతికితేనే చేతివృత్తులు బతుకుతాయన్న ఉద్దేశంతోనే వ్యవసాయాన్ని స్థిరీకరిస్తున్నారు. అన్ని కాలాల్లో ఒకే పంట వేయ డం మంచిది కాదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక రెట్లు సంపద పెరిగింది.
–కరీంనగర్లో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
వ్యవసాయానికి పెద్దపీట
సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఇలాంటి అవగాహనా సదస్సుల నిర్వహణ ఒక గొప్ప కార్యక్రమం. ప్రభుత్వ సూచనలు, సలహాలను అధికారులు క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు తీసుకెళ్లాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నాం. విత్తనాలు, ఎరువులు, కొనుగోళ్లలో సహకార సంఘాలు విజయవంతంగా పనిచేస్తున్నాయి.
– కరీంనగర్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు
సాగునీటి రాకతో వలసలు తగ్గినయ్
ఈ అవగాహన సదస్సులు సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. రైతు బాంధవుడు కేసీఆర్ పాలనలో రైతు రాజయ్యాడు. కాళేశ్వరం నిర్మాణం, సాగునీటి రాకతో వలసలు తగ్గిపోయాయి. రైతు బీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సాగునీరు, ఉచిత కరంటు, రైతుబంధు, రైతు బీమా పథకాలతోపాటు రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే..
–కరీంనగర్లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
శాస్త్రీయంగా వ్యవసాయం చేయాలి
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉత్పత్తి పెరిగేలా రైతులు శాస్త్రీయ వ్యవసాయం చేయాలి. ప్రపంచ మారెట్లో పోటీ పడేలా పెట్టుబడి తగ్గించుకోవాలి. ఉత్పత్తి పెంచుకోవడంపై దృష్టిసారించాలి. సీఎం కేసీఆర్ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో వ్యవసాయ కుటుంబాలకు గౌరవం పెరిగిందని రైతులే చెబుతున్నారు.
– కరీంనగర్, జగిత్యాలలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్
వ్యవసాయం దశ, దిశను మార్చారు
సీఎం కేసీఆర్ వ్యవసాయం దశ, దిశను మార్చారు. రైతువేదికలను సద్వినియోగం చేసుకుని రైతులు లాభదాయక వ్యవసాయంపై దృష్టిపెట్టేలా అవగాహన కల్పించాలి. రైతులకు అన్ని విషయాలు తెలియాలనే అన్ని జిల్లాల్లో వానకాలం పంటల అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఎలాంటి పంటలు వేసుకోవాలో వ్యవసాయ అధికారులతో చర్చించాలి.
–కరీంనగర్, జగిత్యాలలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
లాభదాయక పంటలపై దృష్టి పెట్టాలి
రైతుకు వ్యవసాయం లాభసాటి కావాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. వరి సాగు నుంచి రైతులు లాభదాయక పంటలను పండించడంపై దృష్టిసారించాలి. మన దేశంలో అవసరానికి తగినట్లు నూనె గింజలు పండించక పోవడంతోనే ధరలు ఎక్కువగా ఉన్నాయి. పంట మార్పిడిపై వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితి సభ్యులు రైతులకు అవగాహన కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో అనేక మార్పులు తెచ్చింది. రైతు బంధు సమితులు రైతులను నవీన సేద్యం వైపు నడిపించి, కూరగాయలతోపాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై దృష్టిపెట్టేలా చూడాలి. దీనికోసం అధికారులు రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించాలి. రైతు వేదికలు సక్సెస్ అయితే దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారుతుంది.
– జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్