కరీంనగర్ కమాన్‌చౌరస్తా/ హుజూరాబాద్ టౌన్/సారంగాపూర్/ జ్యోతినగర్, మే 30 ; ఒకరిది తొలిప్రయత్నం.. మరొకరి మూడేండ్ల పోరాటం.. ఇంకొకరిది ఆరేండ్ల కష్టం.. అహోరాత్రులు కష్టపడి.. పుస్తకాలతో కుస్తీపట్టీ సివిల్స్‌లో సత్తాచాటారు ఉమ్మడి జిల్లా బిడ్డలు. దేశవ్యాప్తంగా ఆదివారం వెలువడిన ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభచూపారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యామరి శ్రీధర్ 336, బీర్పూర్ మండలం చర్లపల్లికి చెందిన గుగులావత్ శరత్ నాయక్ 374, రామగుండం మండలం ఎన్టీపీసీకి చెందిన పూజారి శ్రావణ్‌కుమార్ 521, హుజూరాబాద్‌కు చెందిన మాడిశెట్టి అనన్య 544వ ర్యాంకు సాధించి ఉమ్మడి కరీంనగర్ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటారు. తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని నింపడమే కాదు వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. సివిల్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు సత్తాచాటారు. దేశవ్యాప్తంగా ఆదివారం వెలువడిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో నలుగురు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.
కానిస్టేబుల్ కొడుకుకు సివిల్స్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో ఉంటున్న కానిస్టేబుల్ రాంగోపాల్ మల్లేశ్వరి దంపతుల చిన్న కొడుకు విద్యామరి శ్రీధర్ 336వ ర్యాంకు సాధించాడు. వీరి స్వగ్రామం పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్. కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. రాంగోపాల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. శ్రీధర్‌కు అక్క లక్ష్మీ ప్రసన్న, అన్న శ్రీనివాస్ ఉన్నారు. లక్ష్మీ ప్రసన్న గృహిణిగా, శ్రీనివాస్ యూపీఎస్సీ వైద్య విభాగంలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీధర్ పదో తరగతి వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వింద్యావాలీ పాఠశాలలో, నారాయణ కళాశాల హైదరాబాద్‌లో ఇంటర్, మాతృశ్రీ కళాశాల హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎల్ అండ్ టీ సంస్థలో రెండేళ్లు చెన్నై కేంద్రంగా ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత 2015 నుంచి సివిల్స్ ప్రిపరేషన్ వైపు వెళ్లాడు. కష్టపడి చదివా డు. 2021 వరకు 6 సార్లు రాశాడు. ఈ క్రమంలో 2020లో మెయిన్స్‌కు అర్హత సాధించాడు. 2021లో మెయిన్స్, ఇంటర్వ్యూ క్లియర్ చేసి 336వ ర్యాంకు సాధించాడు.
మా సంతోషం మాటల్లో చెప్పలేనిది..
మా కొడుకు శ్రీధర్‌కు సివిల్స్‌లో మంచి ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఐదేళ్లు ఒకే గదికి పరిమితమై కష్టపడి చదివాడు. ఉదయం వ్యాయామం చేయడం తిరిగి వచ్చి పుస్తకాలనే పట్టుకునేవాడు. ఐదుసార్లు పరీక్ష రాసి, ఆరోసారి సాధించాడు. వాడి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది.
– మల్లేశ్వరీ రాంగోపాల్, శ్రీధర్ తల్లిదండ్రులు
మమ్మీడాడీ ప్రోత్సాహంతోనే..
చెన్నైలో ఉద్యోగం చేస్తున్న టైంలోనే సివిల్స్ రాయాలని అనుకున్న. వెంటనే విషయాన్ని మమ్మీడాడికి చెప్పడంతో చాలా ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహం వల్లే ఈ రోజు మంచి ర్యాంకు సాధించగలిగా. మొదట శంకర్ ఐఏఎస్ అకాడమీ, తర్వాత విజన్ ఐఏఎస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న. 2021 మెయిన్స్ ఫలితాల తర్వాత బాల లత మేడం, ఐపీఎస్ మహేశ్ భగవత్, జిల్లాకు చెందిన ఐఏఎస్ అనుదీప్, ఐపీఎస్ రజినీ కాంత్ లాంటి చాలా మంది అధికారులు నాకు ఇంటర్వ్యూలో అనుసరించాల్సిన పద్ధతులు, ముందుకు వెళ్లాల్సిన తీరును చాలా బాగా వివరించారు. అది నాకు చాలా కలిసివచ్చింది.
– విద్యామరి శ్రీధర్, సివిల్స్ 336వ ర్యాంకు
ఒకే అటెంప్ట్‌లో విజయం..
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చర్లపల్లికి చెంది న గుగులోత్ శరత్ నాయ క్ సివిల్స్‌లో 374వ ర్యాం క్ సాధించాడు. మారుమూల అటవీ ప్రాంతంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన గుగులోత్ భాష్యనాయక్, యమునకు ఇద్ద రు కొడుకులు, ఒక కూతురు. భాష్యనాయక్ వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి యమున గ్రామంలోని అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నది. శరత్‌నాయక్ చర్లపల్లిలో ప్రాథమిక విద్యాభ్యాసం, జగిత్యాలలో ఇంటర్ చదివాడు. వెటర్నరీలో పీడీఎస్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. సివిల్స్ కోసం తన మిత్రులతో కలిసి హైదరాబాద్‌లో రూం తీసుకుని కోచింగ్ తీసుకున్నాడు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్ సాధించాడు.
ఎమ్మెల్యే సంజయ్ అభినందనలు..
శరత్ నాయక్‌ను ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ అభినందించారు. ర్యాంకు విషయం తెలుసుకొని ఫోన్ చేసి ప్రశంసించారు. మంచి ర్యాం కుతో దేశంలోనే జగిత్యాలకు పేరు తేవడంపై హర్షం వ్యక్తం చేశారు.
మూడో ప్రయత్నంలో 521వ ర్యాంక్
రామగుండం మండలం ఎన్టీపీసీకి చెందిన పూజారి శ్రావణ్‌కుమార్ 521వ ర్యాంకు సాధించాడు. తండ్రి రాఘవేంద్రరావు రామగుండం ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగం ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. తల్లి లలిత గృహిణి. 2017లో ఇంజినీరింగ్ (ఈఈఈ) పూర్తి చేసిన శ్రావణ్‌కుమార్ రెండు సార్లు సొంతంగా సివిల్స్‌కు హాజరయ్యాడు. మూడో ప్రయత్నంలో భాగంగా ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో ఓ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శ్రావణ్‌ను ఎన్టీపీసీలోని సీఐఎస్ఎఫ్ బ్యారక్‌లో సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాడెంట్ ముఖేశ్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ జెపీ గుప్తా, అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ భాస్కర్ శ్రావణ్‌కుమార్‌ను అభినందించారు.
నా కష్టానికి ఫలితం దక్కింది
నా గోల్ పోలీస్ అధికారి కావడం. నాన్న ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ అధికారి. ఆ యన యూనిఫామే నాకు స్ఫూర్తి. ఇండియన్ పోలీ సు సర్వీస్‌లో చేరాలన్న ఆశయంతో కష్టపడి చది వా. 2017లో ఇంజినీరిం గ్ పూర్తికాగానే, సివిల్స్‌కు ప్రిపేరయ్యా. మూడేండ్ల శ్రమకు ఫలితం దక్కి, ర్యాంకు వచ్చింది.
– పీ శ్రావణ్‌కుమార్, 521వ ర్యాంకు