మంథని టౌన్, మే 30: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఓ మొబైల్ షాపు నిర్వాహకుడి ఖాతాలో రూ. 5.68 కోట్ల నగదు జమ అయిన విషయం పట్టణంలో హల్చల్ సృష్టించింది. మంథని పట్టణంలోని శివసాయి మొబైల్ షాపు నిర్వాహకుడు సాయికి హెచ్డీఎఫ్లోని తన బ్యాంక్ ఖాతాలో ఆదివారం రాత్రి రూ. 5.68 కోట్ల నగదు జమ అయింది. ఈ దాదాపు 5 నుంచి 6 గంటల పాటు తన బ్యాంక్ ఖాతాలోనే ఉందని సాయి వెల్లడించాడు. ఆదివారం సెలవు దినం కావడంతో తాను బ్యాంక్ అధికారులను సంప్రదించలేదన్నారు.
సోమవారం ఉదయం బ్యాంక్ ఖాతా నుంచి నగదు మాయమైందని, ఈ విషయాన్ని మంథని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా సాంకేతిక కారణాల వల్ల మీ అకౌంట్లో నగదు జమ అయినట్టుగా కన్పించిందని, లోపాన్ని సరి చేశామని తెలిపారు. హెచ్డీఎఫ్ బ్యాంకుల్లో కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే క్రమంలో ఇలా జరిగి ఉంటుందని బ్యాంక్ అధికారుల ద్వారా తెలిసింది. మొబైల్ షాపు నిర్వాహకులు రూ. 5.68 కోట్ల నగదు జమ అయిందనే విషయం మంథనిలో దావానలంలా వ్యాపించడంతో చర్చనీయాంశమైంది. హెచ్డీఎఫ్సీ ఖాతాదారులు తమ ఖాతాల్లో ఏమైనా నగదు జమ అయిందేమోనని ఒకటికి పదిసార్లు తమ ఖాతాలను చెక్ చేసుకున్నారు.