కమాన్‌చౌరస్తా, మే 30: విద్యార్థులు ఉపాధి అవకాశాలు లభించే కొత్త కోర్సులపై దృష్టి సారించాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశం సూచించారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం నిర్వహించిన వాగేశ్వరీ డిగ్రీ, పీజీ కళాశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. మారెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని, ఇప్పుడు సంస్థలు డిగ్రీ వారి కోసం అన్వేషిస్తున్నాయన్నారు.
ఎప్పటికప్పుడు కావాల్సిన నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే కొలువుల సాధన సులభమవుతుందని సూచించారు. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన వేడుకల్లో విద్యార్థులు సెల్ఫీలు, నృత్యాలు, ర్యాంప్ వాక్, బ్రేక్ డ్యాన్స్‌లతో హుషారెత్తించారు. కార్యక్రమంలో ఎస్సారార్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, వాగేశ్వరీ డిగ్రీ, పీజీ కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి, సెక్రటరీ రత్నగోపాల్, డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాళ్లు సతీశ్, లింగమూర్తి, వెంకటరెడ్డి, వైస్ ప్రిన్సిపాళ్లు చైతన్య, రమణ పాల్గొన్నారు.