రాంనగర్, మే 30: సోదరితో తరచూ గొడవపడుతున్నాడని బావను కడతేర్చాడు బామ్మర్ది. మద్యం తాగొద్దామని తీసుకువెళ్లి బండ రాయితో కొట్టి చంపాడు. కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ శివారులో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం.. నగరంలోని సాలంపురకు చెందిన ఖాలీద్ హుస్సేన్ మొదటి భార్య నుంచి విడాకులు పొంది కరీంనగర్ మోటార్ డ్రైవింగ్ స్కూల్లో పని చేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం గోదావరిఖనికి చెందిన అఫ్రిన్ సుల్తానాతో రెండో వివాహం జరుగగా, ఇద్దరు కుమారులు జన్మించారు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో తిరిగి విడాకుల దాకా వెళ్లింది.
పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరుగగా ఇద్దరినీ కలిసి ఉండాల్సిందిగా సూచించారు. ఈ విషయంపై అఫ్రిన్ సుల్తానా సోదరుడైన ఎండీ సమీర్ ఖాలీద్ హుస్సేన్‌తో పలుమార్లు గొడవ పడ్డాడు. సోదరి కుటుంబ సమస్యలకు ఖాలీద్ హుస్సేన్‌ను అడ్డు తొలగించడమే పరిష్కారమని భావించాడు. ఆదివారం సాయంత్రం ఖాలీద్ హుస్సేన్‌ను మొగ్దుంపూర్ వైన్స్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం కొనుగోలు చేసి తాగించిన అనంతరం అపస్మారక స్థితికి వెళ్లిన ఖాలీద్ హుస్సేన్(43)ను ఎండీ సమీర్ బండరాయితో తలపై కొట్టి హత్య చేశాడు. మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తరువాత వరిగడ్డి మృతదేహంపై కప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని స్నేహితుడైన జనగాం శ్రీధర్‌కు చెప్పడంతో అతడు ఖాలీద్ హుస్సేన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా హత్య ఘటన వెలుగు చూసింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి సోదరుడు తాహెర్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.