తిమ్మాపూర్ రూరల్, మే 30: మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామంలో గల అంగారిక టౌన్షిప్ ప్లాట్ల వేలంపై సోమవారం సాయంత్రం నుస్తులాపూర్ రైతు వేదికలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్, గరిమా అగర్వాల్, రాజీవ్ స్వగృహ సీఈ ఈశ్వరయ్య హాజరై ప్లాట్ల విక్రయం, వేలం పాట తదితర అంశాలను ఆశావాహులకు వివరించారు. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. డీడీ ఎలా కట్టాలి, ఎక్కడ నమోదు చేయించుకోవాలి, వేలం పాట తేదీలు, పాల్గొనే విధానంపై అవగాహన కల్పించారు. నివాస స్థలాలకు గజానికి రూ.6వేలు, కమర్షియల్ ప్లాట్లకు రూ.8వేలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఒక్క వ్యక్తి ఎన్ని ప్లాట్లు అయినా వేలంలో పాడవచ్చని తెలిపారు. 200 గజాలకొక ప్లాటుగా.. మొదటి విడుతలో 237 ప్లాట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ప్లాటు వేలంలో దక్కించుకున్న 90 రోజుల్లోపు డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. వచ్చే నెల 10న మరోసారి అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు. వేలంలో అవకతవకలు జరిగితే కలెక్టర్ ఎప్పుడైనా రద్దు చేయవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, గతంలో రాజీవ్ స్వగృహ పేరిట ధరావత్తు రుసుం చెల్లించిన వారు తిరిగి వేలంలో పాల్గొనవచ్చన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఆర్డీవో ఆనంద్‌కుమార్, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ ఎలుక అనిత, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, సర్పంచ్ రావుల రమేశ్, ఎంపీటీసీ తిరుపతిరెడ్డి, రియల్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.