ధర్మపురి, మే 29: ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని, పట్టుదలతో చదివి కొలువులు సాధించాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతకు సాంఘిక సంక్షేమశాఖ, ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధర్మపురి పట్టణంలోని న్యూటీటీడీ కల్యాణ మండపం, షాదీఖానా భవనంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను మంత్రి ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. శిక్షణ తరగతులకు హాజరయ్యే అభ్యర్థులకు కల్పిస్తున్న అన్ని వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధ్యాపకులు బోధిస్తున్న అంశాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ పోటీ పరీక్షల్లో నెగ్గి ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎక్కువమంది ఉద్యోగాలు సాధించాలన్నారు. పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్‌ను అందజేశామని, యాప్‌ను కూడా త్వరలో ఇస్తామని చెప్పారు. తపన, పట్టుదల ఉంటే ఉద్యోగ సాధన చాలా సులువన్నారు.
అనంతరం అభ్యర్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్ మాట్లాడుతూ.. యువత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధించి మంత్రి ఈశ్వర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ చేతన్ మాట్లాడుతూ.. అభ్యర్థులు ఉద్యోగం సాధించడానికి ఎలా సన్నద్ధం కావాలో సూచించారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత మాట్లాడుతూ.. అధ్యాపకులు చెబుతున్న అంశాలను శ్రద్ధతో వినాలని, రోజూ న్యూస్ పేపర్ తప్పనిసరిగా చదవాలని చెప్పారు. అనంతరం అభ్యర్థులు సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ చేతన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్లిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, ఆర్బీఎస్ కన్వీనర్ సౌళ్ల భీమయ్య, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జైన పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ల నరేశ్, మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యోరి వేణు, ఎస్డీ యూనుస్, తరాల కార్తీక్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వసంత్, అలీమ్, నాయకులు సంగి శేఖర్, ఒడ్నాల మల్లేశం, అనంతుల లక్ష్మణ్, పురాణపు సాంబమూర్తి తదితరులున్నారు.