శ్రీరాంపూర్, మే 29 : సింగరేణి నివాస స్థలాలకు పట్టాలు పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని, ఇక బంగ్లాలు కట్టుకోండని కార్మిక కుటుంబాలకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సూచించారు. నస్పూర్ మున్సిపల్ పరిధిలో సింగరేణి నివాస స్థలాలకు పట్టాల పంపిణీ కొనసాగుతున్నది. అందులో భాగంగా 16వ వార్డు ఆర్కే-6 గుడిసెలు గాంధీనగర్, హిమ్మత్‌నగర్‌లోని కార్మిక కుటుంబాలకు శ్రీరాంపూర్ శారద శిశుమందిర్ పాఠశాల ఆవరణలో ఆదివారం ఎమ్మెల్యే దివాకర్‌రావు అందజేశారు. ఇక్కడ మొత్తం 204 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ శ్రీరాంపూర్ ప్రాంత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇళ్ల పట్టాల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. అందుకు వెంటనే స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి పట్టాలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నో ఏండ్లుగా ఎంతో మంది ప్రజాప్రతినిధులు పట్టాల కోసం ప్రయత్నాలు చేసినా సాధ్యంకాలేదన్నారు. ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారులంతా ఆయనకు అండగా నిలువాలని కోరారు. పట్టాల పంపిణీ పారదర్శకంగా సాగుతున్నదని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇచ్చిన మాట నెరవేర్చుతానని, తన ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ చేయడం చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు.
ఆర్కే-6 గుడిసెల వాసులంటే ఎంతో అభిమానమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అన్ని మౌలిక సదుపాయాలు, రోడ్లు, మురుగు కాలువలు, తాగునీటి సరఫరా చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, కౌన్సిలర్లు తెనుగు లావణ్యాదేవేందర్, పూదరి కుమార్, కుర్మిళ్ల అన్నపూర్ణ, బండి పద్మ, కాసీం, పంబాల గంగాఎర్రయ్య, నాసర్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, మాజీ సర్పంచులు గుంట జగ్గయ్య, జక్కుల రాజేశం, నాయకులు ఎండీ రఫీక్, పెర్క సత్తయ్య, చెల్ల విక్రమ్, వేల్పుల రవీందర్, వైద్య శ్రీలత, ఆర్ఐ మాంతయ్య, వీఆర్వో వెంకటేశ్, రాజన్న, మంగా పాల్గొన్నారు.