యోగాలో పల్లె తేజం మెరుస్తున్నది.. కఠినమైన ఆసనాలను సులభంగా సాధన చేస్తూ విశేషంగా రాణిస్తున్నది.. జాతీయస్థాయిలో సత్తాచాటుతూ పతకాల పంట పండిస్తున్నది. ఇలా తన అసమాన ప్రతిభతో నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన యువతి అలేఖ్యపై ‘నమస్తే’ ప్రత్యేకం.
గోలేటి గ్రామానికి చెందిన కేసరి ఆంజనేయులుగౌడ్-పద్మ దంపతుల కుమార్తె అలేఖ్య యోగాలో రాణిస్తున్నది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో యోగా ఉపాధ్యాయ శిక్షణతోపాటు యోగాలో ఎంఎస్సీ పూర్తిచేసింది. నిత్యం సాధన చేయడంతోపాటు శిక్షణ అందిస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నది. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని, పతకాలు సాధించి జిల్లాకు, గోలేటి గ్రామానికి వన్నె తెస్తున్నది.
సింగరేణి శిబిరంలో శిక్షణ..
బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవా సమితి అందించే యోగా శిక్షణ శిబిరంలో చేరి యోగాపై పట్టు సాధించింది. తాను ఇంటర్ చదువుతున్న సమయంలో తరచూ అనారోగ్యం పాలయ్యేది. ఈ క్ర మంలో యోగాతో ఆరోగ్యం బాగుంటుందని తెలుసుకున్న తన తండ్రి కేసరి ఆంజనేయులు గౌడ్, యోగాపై ఆసక్తి కలిగించి గోలేటిలోని శిక్షణ శిబిరంలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడ కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు యోగాలో పూర్తి స్థాయి శిక్షణ పూర్తిచేసుకొని, చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నది.
సాధించిన పతకాలు..
2016లో కోల్‌కతాలో జరిగిన జాతీయస్థాయి యోగా చాంపియన్‌షిప్‌లో పతకం సాధించింది. 2017లో హైదరాబాద్, నిజామాబాద్, మంచిర్యాలలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నది. 2018లో విజయవాడలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లోనూ పతకం సాధించింది. అలాగే బెంగళూరులో డాక్టర్ రాజ్‌కుమార్ స్మారక జాతీయస్థాయి ఓపెన్ యోగా పోటీల్లో ద్వితీయ బహుమతి, హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వెండి పతకం తన ఖాతాలో వేసుకున్నది. తమిళనాడులో జరిగిన సౌత్ ఇండియా యోగా పోటీల్లో చాంపియన్‌షిప్ సాధించింది. 2020లో బెంగళూరులో జరిగిన నోబెల్ వరల్డ్ రికార్డులో పాల్గొన్నది. ఈ ఏడాది మే 27,28, 29,30 తేదీల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరుగుతున్న నేషనల్ యోగాశ్రమ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు 10 మంది విద్యార్థుల టీంతో బయల్దేరి వెళ్లింది.
అంతర్జాతీయ ట్రైనరే లక్ష్యం..
అంతర్జాతీయ స్థాయిలో యోగా ట్రైనర్ కావడమే నా లక్ష్యం. అందుకు అహర్నిశలు కృషిచేస్తున్నా. యోగాపై పట్టుసడలకుండా శిక్షణ శిబిరాల్లో చిన్నారులకు ఆసక్తి కలిగించి, శిక్షణ ఇస్తున్న. యోగాకు వయసుతో పని లేదు. ఎవరైనా చేయవచ్చు. యోగాతో దీర్ఘకాలిక వ్యాధులు దూరమవడంతో పాటు ఆరోగ్యం బాగుంటుంది. సింగరేణి సేవా సమితి అందిస్తున్న శిక్షణ శిబిరంలో యోగాసనాలు నేర్చుకున్నా. నా తల్లిదండ్రుల సహకారంతో ఎనిమిదేండ్ల నుంచి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తున్నా.
– కేసరి అలేఖ్య, గోలేటి