గంగాధర, మే 29: అన్నదాతలు అధైర్యపడొద్దని, చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. గంగాధర వ్యవసాయ మార్కెట్లో ఆదివారం ఆయన రైతులతో కలిసి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 70 శాతం ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు తెలిపారు. మిగతా ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని, లారీల కొరతతో గంగాధర వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ చేస్తామని పేర్కొన్నారు. అధికారులతో మాట్లాడి ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాముల వద్దకు ట్రాక్టర్లు, లారీల్లో తరలించాలని, మిల్లుకు సంబంధించిన వ్యక్తి గోదాముల వద్ద అందుబాటులో ఉంటారని చెప్పారు. వాహనాల అద్దె ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ధాన్యం డబ్బులు ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు.
పిడుగు పడిన ఇల్లు పరిశీలన
మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన సుంకె రవి ఇంటిపై శుక్రవారం రాత్రి పిడుగు పడింది. కాగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెళ్లి ఇంటిని పరిశీలించి, నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిడుగు పడిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని కుటుంబసభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ దూలం బాలాగౌడ్, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచ్ మడ్లపెల్లి గంగాధర్, నాయకులు ఆకుల మధుసూదన్, గడ్డం చుక్కారెడ్డి, వేముల అంజి, వడ్లూరి ఆదిమల్లు, మడ్లపెల్లి శ్రీనివాస్, రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
బోనమెత్తిన ఎమ్మెల్యే సుంకె
రామడుగు, మే 29: మండలంలోని షానగర్లో గ్రామస్తులంతా కలిసి పోచమ్మ బోనాలు చేశారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై నెత్తిపై బోనం ఎత్తుకొని మహిళలతో కలిసి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. బోనాల్లో తెచ్చిన నైవేద్యం అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ అని పేర్కొన్నారు. గ్రామాల్లో పోచమ్మ బోనాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సర్పంచ్ సైండ్ల కవిత, ఎంఈటీసీ కొత్త పద్మ, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు చిరుత ఆంజనేయులు, నాయకులు సైండ్ల కరుణాకర్, కలిగేటి లక్ష్మణ్, పెంటి శంకర్, చిరుత రాంచంద్రం, పూడూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.