కరీంనగర్, మే 29 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రాజీలేని కృషి చేస్తున్నది. దేశంలోనే సంచలనం సృష్టించిన రైతుబంధు పథకం ద్వా రా ప్రతి ఎకరాకు పెట్టుబడి సాయంగా రూ.5 వేలు అందిస్తున్నది. ఈ పథకంతో రైతుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధుతో రైతులు పెట్టుబడులు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఏ కారణం చేతనైనా రైతులు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా రైతు బీమా పేరుతో రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నది. డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాలు అందించి అనేక భూసమస్యలను పరిష్కరించింది. ధరణి వెబ్‌సైట్‌ను ప్రవేశ పెట్టి రైతుల భూముల క్రయవిక్రయాలను సులభతరం, పారదర్శకం చేసింది. ఈ పథకాలే కాకుండా కాళేశ్వరం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణంతో రైతుల క్షేత్రాల్లో బంగారం పండేలా నీటి సదుపాయాలన్ని కల్పించింది. 24 గంటల విద్యుత్‌తో రైతుల కష్టాలు తీర్చింది. కేంద్ర ప్రభుత్వం గత యాసంగి సీజన్లో వడ్లు కొనుగోలు చేయలేమని చేతులేత్తేసినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి చివరి గింజ వరకూ కొనుగోలు చేసింది. ప్రభుత్వం నష్టాన్ని భరించినా రైతులు ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని వారికి అండగా నిలిచారు.
3,37,900 ఎకరాల్లో సాగు ప్రణాళిక..
ఈ సారి వానకాలంలో 3,37,900 ఎకరాల్లో సాగు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను సోమవారం జరిగే వర్క్‌షాప్‌లో మంత్రు ల సమక్షంలో ఆమోదిస్తారు. ఈ ప్రణాళిక ప్రకారం చూస్తే వరి 2.45 లక్షలు, మక్క 25 వే లు, కందులు 5 వేలు, పెసర 1,500, మినుములు 5, పల్లి 300, పత్తి 60 వేలు, పొగాకు 100, మిర్చి 800, పసుపు 150, ఇతర పంట లు 45 ఎకరాల్లో సాగు చేయాలని ప్ర ణాళిక సిద్ధం చేశారు. ఇందుకు అవసరమైన విత్తన ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. పచ్చి రొట్ట కింద రైతులు సాగు చేసుకునేందుకు ఇప్పటికే జనుము, జీలుగ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. ఎరువుల అవసరా న్ని కూడా అంచనా వేశారు. 42,025 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో 16,265 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. అలాగే 6,806 మెట్రిక్ టన్నుల డీఏపీకి 3,103 మెట్రిక్ టన్నులు, 26,236 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులకు 24,783, 10,852 మెట్రిక్ టన్ను ల ఎంఓపీ ఎరువులకుగాను 1,039 మెట్రిక్ టన్నులు జిల్లాలో అందుబాటులో ఉంది.
నేడు కరీంనగర్, జగిత్యాలలో నాలుగు జిల్లాల వర్క్‌షాప్
వానకాలంలో ఎలాంటి పంటలు సాగు చేయాలనే విషయాలపై జిల్లా వ్యవసాయ శాఖ ఇప్పటికే రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పించింది. ఏ ప్రాంతంలో ఎలాంటి పంటలు వేస్తే అనువుగా ఉంటుంది..? అనే విషయంపై రైతు వేదికల్లో రైతులతో చర్చలు నిర్వహించిన, అధికారులు రైతులను సాగుకు సన్నద్ధం చేసేందుకు జిల్లా స్థాయిలో సోమవారం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లోని బైపాస్ రోడ్డులోని వీ కన్వెక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు రైతుబంధు సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావుతో పాటు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు హాజరవుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మధ్యాహ్నం 2.30 గంటలకు జగిత్యాలలో జరిగే జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల సదస్సుకు కూడా హాజరుకాబోతుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.