ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుపేద యువతకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అండగా నిలుస్తున్నారు. గంగాధర మండలంలోని కురిక్యాలలో ఫ్రీ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. ఇందులో ఈ నెల 10వ తేదీ నుంచి 200 మంది అభ్యర్థులకు నిష్ణాతులైన సబ్జెక్టు నిపుణులతో బోధిస్తున్నారు. 90 రోజులు ఉచిత శిక్షణతో పాటు, ఫ్రీ మెటీరియల్ అందిస్తుండడంతో నిరుద్యోగ యువకులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
గంగాధర, మే 29 : తెలంగాణ ప్రభుత్వం 80 వేల పైచిలుకు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. గతంలో ఎన్నడూలేనివిధంగా గ్రూప్స్, పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తుండడంతో నిరుద్యోగ యువత ప్రిపరేషన్లో నిమగ్నమైంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాల్లోని ఉద్యోగార్థులకు కోచింగ్ సెంటర్లు అందుబాటులోకి ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు సరైన శిక్షణ తీసుకొనే అవకాశం లేదు. ఆర్థిక భారంతోనే పలువురు వెనుకడుగు వేయాల్సి వస్తున్నది. అరకొర మెటీరియల్‌తోనే పరీక్షలకు ప్రిపేరవ్వాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పల్లెటూరి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇప్పించ్చేందుకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముందుకువచ్చారు. గంగాధర మండలం కురిక్యాలలో కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. దరఖాస్తులు స్వీకరించి అర్హులను ఎంపిక చేసి ఈనెల 10 నుంచి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో ప్రైవేట్ సెంటర్లకు దీటుగా సౌకర్యాలు కల్పించారు. నాణ్యమైన ఫ్యాకల్టీని అందుబాటులో ఉంచారు. 90 రోజు ల పాటు సాగే శిక్షణకు నియోజకవర్గంలోని ఆరుమండలాల నుంచి 200 మంది కోచింగ్ తీసుకుంటున్నారు. వీరికి శిక్షణ తర్వాత ఫ్రీ మెటీరియల్ అందించనున్నారు.
ప్రైవేట్‌కు దీటుగా శిక్షణ..
గ్రామీణ నిరుద్యోగ యువతకు కురిక్యాలలో పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు ఇనిస్టిట్యూట్లకు దీటుగా శిక్షణ ఇస్తున్నాం. సెంటర్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. 10 రకాల సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులు బోధిస్తున్నారు. అభ్యర్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. 200 మంది వరకు విద్యార్థులు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు.
– మోహన్, శిక్షకుడు
సెంటర్లో అన్ని సౌకర్యాలు..
ఎమ్మెల్యే రవిశంకర్ ఆధ్వర్యంలో కురిక్యాలలో నిరుద్యోగుల కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు అమర్చాం. తాగునీటి వసతి కల్పించాం. అవసరం మేరకు టాయిలెట్లు నిర్మించినం. నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఏమైనా సమస్యలు ఎదురైనా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.
– మేచినేని నవీన్‌రావు, సర్పంచ్, కురిక్యాల
సీరియస్‌గా ప్రిపేరవుతున్న..
నేను ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన. మానాన్న హన్మయ్య ఎలక్ట్రీషియన్. ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు. కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేందుకు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించిన. ప్రభుత్వం పెద్దసంఖ్యలో ఖాళీలు భర్తీ చేస్తుండడంతో గ్రూప్స్‌కు సీరియస్‌గా ప్రిపేరవుతున్న. కురిక్యాలలో ఏర్పాటు చేసిన ఫ్రీకోచింగ్ సెంటర్లో తరగతులకు హాజరవుతున్న. ఇక్కడి ఫ్యాకల్టీ చక్కగా బోధిస్తున్నారు. షార్ట్‌కట్ మెథడ్స్ చెబుతున్నారు. సీరియస్‌గా ప్రిపరేషన్‌ను కొనసాగిస్తున్నా.
– మ్యాకల ప్రవీణ్, గంగాధర
పోలీసు ఉద్యోగం నా కల
మాది చొప్పదండి మండలం దేశాయిపేట. నేను డిగ్రీ పూర్తి చేసిన. పోలీసు ఉద్యోగం సాధించడం నా కల. ఇందుకు సీరియస్‌గా సిద్ధమవుతున్న. ఉదయాన్నే గ్రౌండ్‌కు వెళ్లి ప్రాక్టిస్ చేస్తున్న. గంగాధరలో పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ తరగతలు నిర్వహిస్తున్నారని తెలిసి దరఖాస్తు చేసుకున్న. మొదటి రోజు ్ల కలెక్టర్, ఎమ్మెల్యే చెప్పిన సూచనలతో ఆత్మవిశ్వాసం పెరిగింది. కచ్చితంగా జాబ్ కొడుతాననే నమ్మకం కుదిరింది.
– పాకాల ఐశ్వర్య, దేశాయిపేట
ఎస్ఐ కావడమే లక్ష్యం
నాకు చిన్నప్పటి నుంచి ఎస్ఐ ఉద్యోగం సాధించాలనేది కల.. 2018లో హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాను. ఇందుకోసం 30 వేల వరకు ఖర్చుచేసిన రెండు మార్కుల తేడాతో ఉద్యోగం రాలేదు. చాల బాధేసింది. ఈ సారి ఎలాగైనా ఎస్ఐ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ప్రిపేరవుతున్న. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్లో మంచిగా బోధిస్తున్నారు. ప్రణాళికా ప్రకారం చదువుతున్న. కచ్చితంగా జాబ్సాధిస్తా.
– పులిపాక అజయ్‌కుమార్, చొప్పదండి