పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న కరీం‘నగరాన్ని’ ఆధ్యాత్మికంగానూ తీర్చిదిద్దనున్నారు. టీటీడీ నిధులతో అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందుకు పద్మనగర్‌లో కేటాయించిన పదెకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుబీ వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, నమస్తేతెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావు, టీటీడీ తెలంగాణ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాసర్‌రావు ఆదివారం పరిశీలించారు. ఆగమ, వాస్తుశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణంపై సమాలోచనలు చేశారు.
– కార్పొరేషన్, మే 29
కార్పొరేషన్, మే 29: ఇప్పటికే పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న కరీంనగర్లో అద్భుతమైన రీతిలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతు న్నాయి. టీటీడీ నిధులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా నిర్మించాలని నిర్ణయించింది. నగరశివారులోని పద్మనగర్‌లో పశుసంర్థక శాఖకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, నమస్తేతెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, టీటీడీ తెలంగాణ అడ్వైజరీ కమిటీ చైర్మన్ భాసర్‌రావు, స్తపతులు స్థలాన్ని పరిశీలించారు.
10 ఎకరాల విస్తీర్ణంలో ఆగమ, వాస్తుశాస్త్రం, ఆలయ నిర్మాణ శైలి, గర్భాలయం, అంతరాలయం, అర్థ మండపం, మహా మండపం, ముఖమండపం, గరుడాళ్వార్ సన్నిధి, ధ్వజస్తంభం, బలిపీఠం, తూర్పు రాజ గోపురం, ఉత్తర ద్వారం, ప్రాకార మండపాలు తదితర నిర్మాణాలు, కల్యాణ మండపం, వాహనాల పార్కింగ్ తదితర విషయాలపై సమాలోచనలు చేశారు. ప్రస్తుతం ఈ స్థలంలో ఉన్న భారీ వృక్షాలకు ఎలాంటి నష్టం కలిగించవద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో వృక్షాలు తొలగించాల్సి వస్తే వేరేచోట రీ లొకేట్ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఈ ప్రాంతంలోని పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులకు నిర్దేశించారు. వారం రోజుల్లోగా ఈ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని నగర మేయర్ వై.సునీల్‌రావు తెలిపారు. కేటాయించిన స్థలంలో అద్భుతంగా ఆలయాన్ని నిర్మిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో దివ్య క్షేత్రం కరీంనగర్లో ఏర్పాటు కానున్నదన్నారు.
ఈ ఆలయ నిర్మాణానికి టీటీడీ బోర్డు కూడా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. అతి త్వరలోనే పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు కరీంనగర్‌కు విచ్చేసిన నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్‌రావుకు మేయర్ వై సునీల్‌రావు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఇక్కడ కార్పొరేటర్లు గంట కళ్యాణీ శ్రీనివాస్, ఐలేందర్‌యాదవ్, కుర్ర తిరుపతి ఉన్నారు. టీటీడీ స్తపతులు మునిస్వామిరెడ్డి, కృష్ణారావు, యాదాద్రికి పనిచేసిన ఆనంద్ సాయి, సుద్దాల సుధాకర్ తేజ, జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, సర్వేయర్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.